నటుడు కావాలని సినీరంగంలోకి ప్రవేశించి మొదట ప్రొడక్షన్స్‌లో వ్యవహారాలను చూసుకుంటూ.. నిదానంగా ప్రొడక్షన్ మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి గణేష్ బాబు.
తర్వాత నటుడిగా తన కోరిక నెరవేర్చుకుని.. ఏకంగా నిర్మాతగా అవతారమెత్తి, తొలి చిత్రమే రవితేజతో చేసే స్థాయికి ఎదగడానికి క్రేజ్ హీరో రవితేజనే ప్రధాన కారణం అంటున్నారు. నిర్మాత జి. గణేష్ బాబు.
రవితేజ, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన "ఆంజనేయులు" సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని గణేష్ బాబు అన్నారు. ప్రస్తుతం "ఆంజనేయులు" సినిమా రామానాయుడు స్టూడియోలో పోస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా శనివారం ఆయనతో జరిపిన భేటీ..
ప్రశ్న: నిర్మాత కావాలనే కోరిక ఎలా కలిగింది? జ: ఆ కోరిక ముందునుంచే ఉంది. నటునిగా స్థిరపడ్డాక చేయాలనుకున్నాను. స్థిరపడ్డాక ఎవరితోచేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ.. ఓ సందర్భంలో స్నేహితుడైన రవితేజకు చెప్పాను. "చేసేద్దామ్.. కానీయ్.." అంటూ రవితేజ క్యాజువల్‌గా చెప్పారు. దానికి ముందు పూరీ జగన్నాథ్, పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో చేయాలనుకున్నాను. "పులి" షూటింగ్ వల్ల అది వెనక్కు వెళ్ళింది. దీంతో రవితేజ సబ్జెక్ట్ ముందు వచ్చింది.
ప్రశ్న: నిర్మాతగా పలు ఆటంకాలుంటాయి గదా? వాటిని అధిగమించి సినిమా తీయగలిగారు? జ: నిజంగా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇంత త్వరగా సినిమా పూర్తయిందా అనిపించింది. ఇదంతా రవితేజ క్రెడిట్. ఏ రోజూ ఇబ్బంది పెట్టలేదు. పైగా షూటింగ్ రోజుల్లో కొంచెం గ్యాప్ వస్తే ఆ టైమ్‌లో ఏదైనా షాట్ తీసుకోవచ్చు కదా అని యూనిట్ సభ్యులు ఎంకరేజ్ చేసేవాళ్లు. మొట్టమొదటి సినిమా రవితేజతో చేయడం ఒకటైతే.. అంతకుముందు నటించిన "కిక్" విజయం సాధించడం మరో ఎత్తు. మొత్తానికి రవితేజ నన్ను నిర్మాతగా నిలబెట్టాడు.
ప్రశ్న: ఈ చిత్రంలో నటించకపోవడానికి కారణం? జ: నిర్మాణంలో అన్ని పనులు నేనే చేసుకోవాలి. నేను మొహానికి రంగు పూసుకుని కూర్చుంటే.. ప్రొడక్షన్ గాడి తప్పుతుందనే భయం. అది తొలి సినిమా చేస్తున్నాం. జాగ్రత్తగా చేయమని రవితేజ కూడా అంటుంటేవాడు.
WD
ప్రశ్న: ఈ సినిమాద్వారా అనవసరపు ఖర్చు 5కోట్లు మిగిల్చారని దాసరిగారు కామెంట్ చేశారు. ఎలా? జ: (నవ్వుతూ..) దాసరిగారు అన్నట్లు అంతలేదుగాని.. కొంత నిర్మాణవ్యయం తగ్గించుకున్నాం. సొంతగా అన్నీ చూసుకుంటే చాలా మిగులుతుంది. షూటింగ్ పర్మిషన్లు, ఇతరత్రా కొనుగోలు వ్యవహారాలు దగ్గరుండి చూసుకోబట్టే చాలా మిగిలింది. లేదంటే లక్షల్లో తేడా వచ్చేది.
ప్రశ్న: ఆంజనేయులు ఏం చేస్తాడు? జ: హెచ్.ఎం.టీవీ కెమెరామెన్‌గా రవితేజ నటించాడు. వృత్తిపరంగా ఎదురయ్యే సంఘటనలకు ఎంటర్‌టైన్‌మెంట్ జోడింపే ఆంజనేయులు సినిమా.
ప్రశ్న: దర్శకుడు ఎలా డీల్ చేశారు? జ: తన కథపై తనకు నమ్మకం. తన పనిపై తనకు పూర్తి విశ్వాసం ఉన్న వ్యక్తి పరశురామ్. యువత చిత్రాన్ని చూశాను. అద్భుతంగా తెరకెక్కించాడు. ఆంజనేయులు కూడా అంతకంటే బాగా చేశాడు. కామెడీ సీన్స్ చేయడంలో పరశురామ్ దిట్ట. అప్పటికప్పుడు సీన్స్ రాసుకుని అవసరమైతే మార్చేస్తుంటాడు. డబ్బింగ్‌లోకూడా పంచ్‌డైలాగ్‌లు రాసి మెప్పించాడు. భవిష్యత్‌లో రాజమౌళి, వినాయక్ స్థాయికి ఎదుగుతాడు.
ప్రశ్న: బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుంది? జ: రవితేజకు పనిచేసే ఆఫీసులో బాస్‌గా బ్రహ్మానందం నటించాడు. ఇద్దరి కాంబినేషన్‌లో నవ్వులే నవ్వులు. వీరికి తోడు జయప్రకాష్‌రెడ్డి, కోట, ఎం.ఎస్, అలీలు కూడా ఉన్నారు. పూర్తి వినోదాన్ని పంచే ఆంజనేయులు తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకముంది.
ప్రశ్న: మళ్ళీ రవితేజతో చేసే ఆలోచన ఉందా? జ: ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పూరీ జగన్నాథ్ చిత్రం చేస్తాం. మళ్ళీ రవితేజతో డేట్స్ కుదిరితే ఆయనతోనూ కొత్త సినిమా చేస్తాం.