1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. Interview

Hansika| Interview| Desamuduru| Kantri| Hansika| Nitin| Jayeebhava| Sitaramula Kalyanam | ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడమే నా గోల్: హన్సిక

హన్సిక
"దేశముదురు" చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన బోర్నవిటా గర్ల్ హన్సిక మొత్వాని. హీరోకు ఇమేజ్ సంపాదించి పెట్టిన "దేశముదురు" చిత్రం తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తర్వాత మెహర్‌రమేష్ కంత్రి, మస్కా చిత్రాల్లో నటించింది. అనంతరం "జయీభవ"లో నటించింది.. కానీ అదీ పెద్దగా ఆడలేదు. 

తాజాగా నితిన్‌తో "సీతారాముల కళ్యాణం" (లంకలో) నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతోంది. నితిన్, హన్సికలపై రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం..

ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
జ: ఛాలెంజింగ్ పాత్ర. హీరోతో కలిసి విలన్‌ను ఛాలెంజ్‌చేసే క్యారెక్టర్. హీరో నిన్ను ఓడిస్తానని విలన్‌తో సవాల్ చేస్తా. దేనికోసం అనేది చిత్రంలో చూడాల్సిందే.

ప్రశ్న: నితిన్‌తో నటించడం ఎలా అనిపించింది?
జ: నితిన్ చాలా సైలెంట్ మనిషి. జెంటిల్మెన్. ఆయనతో పనిచేయడం కంఫర్ట్‌బుల్‌గా ఉంది.

ప్రశ్న: తెలుగు సినీ ఇండస్ట్రీ మీకు నచ్చిందా?
జ: తెలుగు ఫీల్డులో డిసిప్లెన్ ఎక్కువ. ఏదైనా టైమ్ టు టైమ్ జరుగుతుంది. నేను హిందీలో నటిస్తున్నాను కానీ అక్కడ ఇది లేదు. తెలుగులో నచ్చితే ఆకాశానికెత్తేస్తారు.

ప్రశ్న: నటిగా ఎటువంటి పాత్ర చేయాలనుంది?
జ: ఆర్టిస్టుగా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడమే నా గోల్. లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేయాలనుంది. ఇంకా వయస్సులో చిన్నదాన్ని గనుక పరిణతి సాధించాకే అలాంటి పాత్రలు ప్రయత్నిస్తా.

ప్రశ్న: మీరు చేస్తున్న చిత్రాలు?
జ: బాలీవుడ్ ఇమ్రాన్‌ఖాన్‌తో (అమీర్‌ఖాన్ మేనల్లుడు) పాటు మరో ప్రముఖ హీరో చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో ఐదు చిత్రాలు కమిట్ అయ్యాను. ఇందులో గోపిచంద్‌తో కలిసి ఓ చిత్రంలో చేస్తున్నాను.

ప్రశ్న: మీ రోల్‌మోడల్..?
జ: మా అమ్మే నా రోల్‌మోడల్. అమ్మ స్కిన్ స్పెషలిస్ట్. డాక్టర్‌గా ఉంటూనే తల్లిగా ఆమె తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తుంది.

ప్రశ్న: సినిమా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి?
జ: ముందుగా స్క్రిప్ట్ చూసుకుంటా. బేనర్‌తో పనిలేదు.

ప్రశ్న: ఈ మధ్య ఐటంసాంగ్‌లో నటించారు కదా? మళ్లీ అటువంటి..?
జ: మెహర్‌రమేష్ అడిగారు కాబట్టి చేశాను. ఆయన అడిగితే చేయడానికి సిద్ధమే. కానీ వేరే చిత్రాల్లో చేయను. ఎందుకంటే నన్ను "దేశముదురు" చిత్రానికి పరిచయం చేసింది ఆయనే. పూరీ దర్శకత్వ శాఖలో ఆయన పనిచేసేవాడు. ఆయన నాకు బ్రదర్‌లాంటివాడు.

ప్రశ్న: ప్రేమ గురించి మీ అభిప్రాయం?
జ: నాకింకా 18 సంవత్సరాలే. ఆ విషయం మాత్రం నన్ను అడగొద్దు.

ప్రశ్న: మీ ఇష్టాఇష్టాలు..?
జ: రజ్మా చావల్ అంటే చాలా ఇష్టం. మంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. సంగీతం అంటే చెవి కోసుకుంటా. నాకున్న మంచి స్నేహితుడు నా కెమెరానే. ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బందిస్తా.

ప్రశ్న: కాస్ట్యూమ్స్‌పై మీ అభిప్రాయం..?
జ: నా దృష్టిలో సినిమా వేరు. జీవితం వేరు. సినిమాలో ఎలా మోడ్రన్ డ్రెస్‌లు వేసుకంటానో.. బయట కూడా అంతే. ఈ వయస్సులో కాకపోతే మరో 20ఏళ్లు తర్వాత ఈ డ్రెస్‌లు వేసుకోలేనుగదా..!

ప్రశ్న: అల్లు అర్జున్‌తో నటించనన్నారు?
జ: లేదు. ఎందుకు ఇలా వక్రీకరిస్తున్నారో తెలియదు. దేశముదురులో నటించాను. తర్వాత చిత్రంలో నాకు డేట్స్ కుదరలేదు. అందుకే నటించలేదు.
About Writer
SELVI.M