ప్రధాన పేజివినోదం » వెండితెర » ముఖాముఖి » సినిమా బజారున పడిపోయింది: కోట శ్రీనివాసరావు (Kota Srinivasa rao Interview | Birth Day | July 10)
సినిమా బజారున పడిపోయింది: కోట శ్రీనివాసరావు
సోమవారం, 9 జులై 2012( 19:40 IST )
WD
కోట శ్రీనివాసరావు డైలాగ్‌లోనూ, నటనలోనూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్న నటుడు. ఇండ్రస్టీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన పుట్టినరోజు జులై 10. ఈ సదర్భంగా మీడియాతో తన భావాలను పంచుకున్నారు.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది..? జీవితంలో ఏంజరుగుతుందో ఎవరికీ తెలిదు. బ్యాంక్ ఉద్యోగినైన నేను ఈ స్థాయికి చేరతానని ఊహించలేదు. రవీంద్రభారతిలో ఓ నాటకం వేస్తున్నాను. దానికి సి.ఎస్.రావు దర్శకుడు. అందులో నా వేషం చూసి 1978లో క్రాంతికుమార్ తను నిర్మించిన 'ప్రాణంఖరీదు' చిత్రంలో ఓ పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమాతో బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న నేను అనుకోకుండా నటుడిగా మారాను.
ప్రజలపై సినిమా ప్రభావం ఎలా ఉందంటారు..? నేను సినిమాల్లోకి ప్రవేశించిన తొలినాళ్లలో సినిమా ప్రభావం జనాలపై ఉండేది. ఎందుకంటే సామాన్య జనానికి సినిమా దూరంగా ఉండేది కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మారుతున్న కాలాన్ని బట్టి వచ్చిన మార్పుల కారణంగా సినిమా బజారున పడిపోయింది. అందుకే జనం సినిమాను సినిమాలా చూస్తున్నారు తప్పించి దాన్నుంచి నేర్చుకోవాలని అనుకోవడం లేదు.
రావుగోపాలరావు తర్వాత అంతటి విలనిజాన్ని పండిస్తున్న మీకు కెరీర్లో మలుపు తిప్పిన చిత్రం ఏది..? ప్రాణం ఖరీదు తర్వాత అమరజీవి, బాబాయ్ అబ్బాయ్, మావూరి దేవత చిత్రాల్లో నటించాను. ఆ తర్వాత చేసిన ప్రతిఘటన నటుడిగా కెరీర్‌ని మలుపు తిప్పింది. తెలంగాణ యాసలో నేను పండించిన విలనిజమ్ అందరినీ ఆకట్టుకోవడంతో ఆ సినిమా తర్వాత నటుడిగా బిజీ అయ్యాను. నటుడిగా నాకంటూ ప్రత్యేకత సంతరించుకోగలిగాను.
మిమ్మల్ని ఇండస్ట్రీ తారలు బాగా అభినందించిన సందర్భాలు.... ప్రతినాయకుడి పాత్రల్లో నాకు 'ఇంట్లో ఇల్లాలు-వంటిల్లో ప్రియురాలు' బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి చిత్రాలు కోట కరుణ రసాత్మక పాత్రల్లో కూడా మెప్పించగలడని నిరూపించాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూసి చాలామంది స్టార్‌లు నాకు ఫోన్ చేసి అభినందించడం మర్చిపోలేను.
ఇతర భాషా చిత్రాల్లో ఎన్ని సినిమాలు చేశారు? తమిళంలో 25, కన్నడలో 6, హిందీలో 6 చిత్రాల్లో నటించాను. కెరీర్‌పరంగా చాలా సంతృప్తినిచ్చింది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ చెప్పారు కోట శ్రీనివాసరావు.