'నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చెనో..' దాదాపు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరి నోటా ఈ పాట బహుశా నానుతూనే ఉంటుంది. దేవదేవుడిని సైతం వశపర్చుకోవాలంటే, ఆ దేవదేవికి మొరపెట్టుకోవడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ పాత సినిమా గీతం చెబుతోంది. ఈ పాట రంగులరాట్నం సినిమాలోది. అమ్మగారికి మొరపెట్టుకోవడం ద్వారా సాక్షాత్తూ కోరిన వరాలిచ్చే శ్రీనివాసుడ్ని సైతం వశపర్చుకోవచ్చు అనే మేటి సందేశాన్ని దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ తెలుగు సినిమా పాట చిరస్మరణీయ రీతిలో వెలువరించింది. సగటు మనిషి గుణాలను దేవుడికే ఆపాదించి అలరించిన ఈ గీతం తెలుగు సినీ గీత సాహిత్యంలో వెల్లివిరిసిన ఓ అనర్ఘరత్నం.
తెలుగు నుడికారానికి, తెలుగు పదాల తియ్యందనాలకు సాక్షీభూతంలా నిలిచిన ఈ పాట ఎలా మొదలవుతుందో చూడండి. భక్తుల సేవలో తరించిన తిరుమల శ్రీనివాసుడు ఇక విశ్రాంతి తీసుకోవడానికి ఏడుకొండలూ దిగి అలివేలి మంగ చెంత చేరడానికి సిద్ధమయ్యే సమయాన్ని భక్తుడు వడిసిపట్టుకున్న తీరును ఈ పాట పల్లవి అద్భుతంగా చిత్రించింది. "నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో తిరుమల శిఖరాలు దిగివచ్చునో."
ఈ చరణం తర్వాత పాటలో మొదలయ్యే ఒక్కో వాక్యం, పదం తెలుగు సాహిత్యంలో కరుణరసానికి తలమానికాలుగా కలకాలం వెలుగొందుతాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు.
సగటు అధికారి సతీమణికి తృణమో, ఫలమో, ధాన్యమో, వస్త్రమో ఏదో ఒకటి అర్పిస్తే ఆమె మొహమాటానికైనా వాటిని తీసుకుని ఆ వ్యక్తిపై ప్రసన్న కరుణా కటాక్ష వీక్షణాలను కురిపించవచ్చు గాక, భర్తకు ఆ పని చేసిపెట్టమని ప్రతిపాదించవచ్చు గాక. కాని ఇక్కడ సాక్షాత్తూ దేవదేవితో వ్యవహారం కావటంతో ఇక్కడ లంచం గించం పనికిరాదు. ఈ నిరుపేద భక్తుడు ఎంత ఒద్దికతో, ఎంత వినయపూర్వకంగా ఆమెను వేడుకుంటున్నాడో చూడండి...
'మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ' - అమ్మలగన్నయమ్మ కాదు మా భక్తులందరి అమ్మవు... నీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోగలం మేము.... ఇంతకు మించిన నమస్కార బాణం ఎవరైనా ఎక్కడైనా సంధించి ఉండగా చూశామా మనం.. హృదయాన్ని ఇంత గాఢంగా కొడితే మనమే కాదు ఆ అలివేలమ్మ సైతం కరిగిపోదా మరి..
'పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ'... మనస్తత్వ పరిశీలనా శక్తి తారాస్థాయికి చేరితే తప్ప ఇంత గొప్ప వాక్యం కవి మనసులోంచి రాదు. సుదీర్ఘ విరామానంతరం దంపతులు కలుసుకోవడం... తమకే సొంతమైన ఏకాంతంలో ఒకరి ఒడిలో ఒకరు అలసి సొలసి సేదతీరడం, సతీ సంపర్కగత హృదయాంతరంగుడై భర్త సంతోష సముద్రంలో తేలియాడుతుండడం.. సమయం, సందర్భాన్ని చూసి మరీ కొట్టడం అంటే ఇదే కదా...
ఎంత దేవదేవులైతే మాత్రం భార్యా భర్త సంబంధంలోకి వచ్చాక గొడవలంటూ రాకపోవు గదా. మరి విన్నపాలు తీరవలెనంటే ఈ గొడవల కాపురం ఉండకూడదు. అందుకే పతిదేవుడి ఒడిలో అమ్మగారు మురిసిపోతున్నప్పుడు, ఆమె మురిపాలు చూసి శ్రీనివాసుడు మందహాసపు వెన్నెలలు కురిపిస్తున్నప్పుడు.. అప్పుడు, ఆ సమయంలో మాత్రమే స్వామికి మాగురించి చెప్పు తల్లీ అని మొరపెట్టుకోవడం. |