ప్రధాన పేజివినోదం » వెండితెర » నాటి వెండి కెరటాలు » సాహితీవనంలో అందమైన "పురుగు" ఆరుద్ర (Telugu entertainment | Old cinema | Arudra | Sri Sri | poet | Bhagavatula sadasiva shankara shastri)
"తరానికో వంద కవులు.. తయారవుతారెప్పుడూ వందనూ మందలోనూ... మిగలగలిగేదొక్కడు''...
అంటూ తన మాటల్లోనే అభ్యుదయ కవిత్వోద్యమంలో నిలదొక్కుకుని, ఆ తరంలో మిగలగలిగిందీ, విశ్వరూపం దాల్చిందీ ఒక్కడే. ఆ ఒక్కడే "కళాప్రపూర్ణు"డిగా సాహితీప్రియుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన ఆదర్శనీయుడు "ఆరుద్ర". ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన, అరుదైన సంఘటన ఏదంటే.. ఆరుద్ర అనే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, ఒక ఇతిహాసంగా రూపొందడమే.
కవి, విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు, సామాజిక శాస్త్రవేత్త, మార్క్సిస్టు మేధావి.. ఇలా అన్నింటినీ మించి ఒక మంచి మానవుడు, సహృదయుడు, స్నేహశీలి అయిన ఆరుద్ర జీవితప్రస్థానం ఒక ఇతిహాసం, ఒక సాహిత్య సాంస్కృతిక సుదర్శనం. అభ్యుదయ కవులలో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే, ఆరుద్ర రెండవ తరానికి చెందినవాడు, ఒకే ఒక్కడు. నేడు ఆ ఒకే ఒక్కడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో...
ఆరుద్ర అసలు పేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి. 1925వ సంవత్సరం ఆగస్టు 31వ తేదీన వెంకట జోగమ్మ, భాగవతుల నరసింగరావు దంపతులకు జన్మించారు. ఆరుద్ర ఒక నక్షత్రం పేరు. ఒక పురుగు పేరు కూడా. వర్షకాలంలో నేల పరిచిన పచ్చటి తివాసీలా ఉన్నప్పడు, ఎర్రగా ముఖమల్‌లా మెత్తగా మెరుస్తూ నేలపై నడయాడే అందమైన పురుగు ఆరుద్ర. చిన్నప్పడు ఆరుద్ర కూడా ఆ పురుగులాగే ఎర్రగా, బొద్దుగా, చూడముచ్చటగా ఉంటే, స్నేహితులు అతనికి వెటకారంగా పెట్టిన పేరే స్థిరపడింది. సాహిత్యలోకానికి ఆయన ఆరుద్రగానే పరిచయమయ్యారు.
ఏ.వీ.ఎన్ హైస్కూల్‌లో, తరువాత విజయనగరంలోని యం.ఆర్.కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1934-47 మధ్యకాలంలో రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో గమస్తాగా పనిచేశారు. చిన్నప్పటినుండి సంగీతంపట్ల మక్కువ ఉన్న ఆరుద్ర ఉద్యోగం వదిలేసి కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆ తరువాత ఆయన దృష్టి సాహిత్యం వైపు మళ్ళింది. 1947-48 మధ్యకాలంలో మద్రాసు నుండి వెలువడిన ‘ఆనందవాణి’ పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు.
ఆ పత్రికలో శ్రీశ్రీతో పాటుగా ఎన్నో కవితలను వ్రాశారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆరుద్ర. ఆయన రచనల్లో మార్క్సిస్టు భావజాలం ఉండడాన్ని బట్టి ఆరుద్రపై శ్రీశ్రీ రచనల ప్రభావం ఉందని పలువురు సాహితీ వేత్తలు అంటుంటారు. 1946లో ఆరుద్ర చాలా కష్టాలు అనుభవించారు. తినడానికి తిండికూడా లేక మద్రాసులోని "పనగళ్ పార్కు"లో నీళ్ళు తాగి పడుకున్నారు. అయినా ఇవేమీ ఆయన సాహిత్యసేవకు అడ్డురాలేదు.
కేవలం సినిమా పాటలేకాదు, గేయాలు, గేయనాటికలు, కథలు, నవలలు, సాహిత్య పరిశోధక వ్యాసాలు, వ్యంగ్య రచనలు ఇలా కొన్ని వందల రచనలు ఆయన కలం నుండి జాలువారాయి. ఆయన రాసిన రచనలతో ఆంధ్ర సాహిత్యం ఉన్నత శిఖరాలనధిరోహించింది. ఇంత వైవిధ్యమున్న రచయిత మరొకరు ఉండరేమో అనేంతగా ఉంటాయి ఆయన రచనలు.