ప్రధాన పేజివినోదం » వెండితెర » నాటి వెండి కెరటాలు » బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ (Telugu Entertainment | Telugu Cinema | old cinema | Dr. Bhanumathi Ramakrishna | writer | singer)
స్వర్గీయ భానుమతీ రామకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. భారతదేశం గర్వంచదగ్గ నటీమణుల్లో ఆమె ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు అనితరసాధ్యమైనవి. ఏడు దశాబ్దాలు ఆమె సినీకళామతల్లికి చేసిన సేవలు అజరామరం.
"చలనచిత్ర ధరిత్రి చరిత్ర ముఖపత్రాన్ని గర్వకారణాల తోరణాలతో అలంకరించడానికి అక్షరక్రమాన పేర్లు ఎన్నికచేస్తే ‘బి’ శీర్షిక కింద బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి పేరు చేరుతుందని సినీజనులూ, సినీ జనాభిమానూలు కూడా అంగీకరిస్తారు" - ఇది 1959 సెప్టెంబరు 16న ఆంధ్ర సచిత్ర వారపత్రికలో "తెలుగు వెలుగులు" శీర్షికలో అచ్చయిన వ్యాసంలోని ప్రారంభ వాక్యం. నిజమే అందులో ఎలాంటి సందేహం లేదు.
కేవలం పురుషులకే సాధ్యం అయిన సినీ సాంకేతిక నైపుణ్యంలోనూ ప్రావీణ్యం సంపాదించి నటిగా, గాయనిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, రచయితగా, సంగీత దర్శకురాలిగా విభిన్న కోణాలను స్పృశిస్తూ సాటిలేని మేటి తెలుగు కళాకారిణిగా ఎదిగారు భానుమతి. ఆరణాల తెలుగింటి అత్తగారి కథల "భానుమతి"గా ఆమె పేరు తెలుగు సినీవినీలాకాశాన దాదాపు అర్ధశతాబ్దం పాటు మారుమోగిందంటే అతిశయోక్తికాదేమో. నేడు భానుమతిగారి జయంతి సందర్భంగా ఆ మహానటి గురించి...
1925వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన.. ప్రకాశం జిల్లా, ఒంగోలులోని దొడ్డవరం గ్రామంలో భానుమతి జన్మించారు. హీరోయిన్లుగా ఆడవారి వేషాలు కూడా మగవారే వేసే ఆ రోజుల్లో ధైర్యం గా నేనున్నానంటూ కేవలం 13 సంవత్సరాల ప్రాయంలో ఇంట్లో సనాతన కట్టుబాట్లను ఎదిరించి, సంప్రదాయ సంగీత కళాకారుడైన తండ్రి బొమ్మ రాజు వెంకటసుబ్బయ్యను ఒప్పించి సినిమాలలో వేషం కట్టారు భానుమతి. తండ్రి స్ఫూర్తితో తాను కూడా సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని నేర్చుకుని అపార సంగీత జ్ఞానాన్ని సముపార్జించారు.
1939 సంవత్సరంలో తొలిసారిగా "వర విక్రయం" అనే చిత్రంలో నటించిన భానుమతి కెరీర్‌ను ఆ తరువాత వచ్చిన "కృష్ణప్రేమ", "స్వర్గసీమ" చిత్రాలు మలుపుతిప్పాయి. ఆ సినిమాలో హీరోతో సమానమైన పాత్రలనే ఒప్పుకునేవారు ఆమె. చాలా మంది ఆమెకున్న కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నైజాన్ని అందరు పొగరు అనుకునేవారు. అయినా ఆమె చలించేవారు కారు.
1943, ఆగష్టు 8వ తేదీన తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును భానుమతిగారు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె ప్రేమ వివాహం గురించి అందరికి తెలిసినా ఆ ప్రేమను సాధించుకోడానికి భానుమతిగారు నిరశన దీక్ష చేయడం, గౌరిదేవి పటం ముందు మౌనంగా కూర్చొని రోదించిన విషయం చాలా మందికి తెలియదు. తాను అనుకున్నది సాదించుకోవడం భానుమతి గారికి తెలిసినంతంగా మరెవరికి తెయదు. వీరిద్దరి ఏకైక కుమారుడు భరణి. ఆయన పేరుమీదనే ‘భరణి’ సంస్థను స్థాపించిన ఈ దంపతులు అనేక అపూర్వ చిత్రాలను అందించారు.