ఈనెల 26న "నీ నవ్వే చాలు"
హైదరాబాద్ (ఏజెన్సీ), గురువారం, 24 మే 2007( 11:58 IST )
శివాజీ, నిఖిత, సింధుతులానీ హీరోహీరోయిన్లుగా జశ్వంత్ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం 'నీ నవ్వే చాలు'. దీనికి మల్లికార్జున్ యేలూరి దర్శకుడు. శ్రీధర్ చౌదరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ఈ సందర్భంగా చిత్రంలోని పాటలను మంగళవారం ప్రదర్శించారు. అనంతరం కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ, భాగ్యరాజా చిత్రాలు ఎంతటి ఆనందాన్ని అందిస్తాయో ఈ చిత్రమూ అంతటి ఆనందాన్ని ప్రేక్షకులకి అందిస్తుంది. ఇప్పటికే సంగీతానికి మంచి స్పందన వచ్చింది. ముక్కోణపు ప్రేమకథతో ఈ చిత్రం రూపొందింది. నా కెరీర్‌లో మంచి చిత్రమవుతుందనే ఆశిస్తున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, మధ్య తరగతికి చెందిన అబ్బాయి ఇద్దరు అమ్మాయిల కథ. వారి మనస్తత్వాలు, ఆశయాలు ఎలా ఉంటాయనేది ఈ చిత్రంలో చూపించాం. మూడు కుటుంబాల నేపథ్యంలో కథసాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు. చిత్ర యూనిట్ సహకారంతో అనుకున్న టైంలో విడుదలచేస్తున్నామని చిత్ర సమర్పకుడు గొట్టిముక్కల పద్మారావు చెప్పారు.