బీవీ రమణ దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న ఒంటరి చిత్రాన్ని పోకూరి బాబురావు నిర్మిస్తున్నారు. గొపీచంద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో భావన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రెండు పాటలు మినహా టాకీ పార్టు పూర్తయింది.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మిగిలిన రెండు పాటలు చిత్రీకరించేందుకు షీషెల్స్ అనే దేశానికి త్వరలోనే వెళ్లనున్నట్లు చెప్పారు. కథలోకి వెళ్తే... అనురాగం.. ఆప్యాయత.. ప్రేమ కలగలిపి ఉన్న కుటుంబంలోని వ్యక్తి కథే ఈ చిత్రమన్నారు.
సాంప్రదాయ కుటుంబంలోని ఓ వ్యక్తిని ఒంటరి చేయాలనుకునే భావన శత్రువులకు ఎందుకు కలిగింది..? దానిని ఒంటరిగా ఆ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు..? అనే దానిపై కథ సాగుతుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెలలోపే ఆడియోను... ఫిబ్రవరి నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
గోపీచంద్ మాట్లాడుతూ నటుడిగా తనకు ఈ చిత్రం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను కొన్ని సన్నివేశాల్లో కనపడ్డా.. ఎంతో కీలక పాత్రను పోషించడం ఆనందంగా ఉందని చెప్పాడు.
ఈ చిత్రంలో ఇంకా పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, ఆశిష్ విద్యార్థి, రజిత తదితరులు నటిస్తుండగా.. సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.