ప్రచారానికి భిన్నంగా శివాజీ : ఆందోళనలో బయ్యర్లు
శుక్రవారం, 15 జూన్ 2007( 20:02 IST )
ఇద్దరు హేమాహేమీలను బేరీజుకువసేకుని సినిమాకు వెళితే ఆశాభంగం కలగకమానదని బయ్యర్లు మాటల్లో స్పష్టమౌతోంది. ఇప్పిటికే రెండు వారాలపాటు పలు థియేటర్లలో టిక్కెట్లు అమ్ముడవడంతో ఆ తర్వాత ఏమిటనేది తేలాల్సి ఉంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని పలు తెలుగు సినిమాలు వాయిదాపడుతూ వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోనే దాదాపు 42 థియేటర్లలో శివాజీ ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న పలు సినిమాల నిర్మాతలు శివాజీ చిత్రం ధాటికి తమ చిత్రాల కలెక్షన్లు తగ్గుముఖం పడతాయేమోనని బెంబేలెత్తారు. కానీ శుక్రవారం నాటి రిపోర్ట్ వారికి ఊరట కలిగించింది. చాలా చోట్ల ఈ చిత్రం బాబాను పోలి ఉందనీ, జంటిల్‌మెన్, భారతీయుడు రేంజ్‌లో ఊహించికుని ఆశాభంగం చెందామని బయ్యర్లు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా రజనీకాంత్ శివాజీ చిత్రానికి వచ్చి పబ్లిసిటీ మరే చిత్రానికి రాలేదు. తమిళనాడులో కరుణానిధికి చూపించడంతోపాటు హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడికీ చూపించి పత్రికల్లో ఉచిత ప్రచారానికి మూటకట్టుకున్నారు. శివాజీ విడుదలైన తొలి రోజు తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత శివాజీ ప్రత్యేక ప్రదర్శనను తిలకించడం అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో పాటు భారతీయుడు, అపరిచితుడు, జంటిల్‌మెన్ చిత్రాల దర్శకుడు శంకర్ క్రేజ్ ఒక కారణమైతే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు ప్రఖ్యాతులు ఈ చిత్ర వ్యాపారాన్ని ఎవరూ ఊహించనంత రేంజ్‌కు తీసుకెళ్ళాయి. ఇన్ని విశేషాలను సంతరించుకున్న శివాజీ చిత్రాన్ని శుక్రవారం చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది పెదవి విరవడం చిత్రాతిచిత్రం.
హైదరాబాద్‌లోని ఆర్టీసీక్రాస్‌రోడ్డులో గల దేవి థియేటర్‌లో టిక్కెట్ల కోసం వచ్చిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందుగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని మీడియా కోడైకూస్తున్నా ఆ విషయాలేవీ తమకు తెలీవనే ప్రేక్షకులు రావడం వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇక చెన్నైలో ఈ చిత్రం బాగుందనే రిపోర్ట్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఏదిఏమైనా ప్రేక్షకుల తీర్పు ఒకేరీతిగా ఉంటుందని చాలా చిత్రాలు నిరూపించాయి. కానీ శివాజీ ఇందుకు భిన్నంగా ఉండడం విశేషం. అంతేకాక శివాజీ ప్రధమార్ధంలో భారతీయుడు, బాబా అంశాలు పోలినట్లుందనీ, రెండవభాగం ఠాగూర్, ఆపరేషన్ దుర్యోధనను పోలి ఉందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవీఎం. చిత్ర నిర్మాణం తన 60వ వార్షికోత్సవ సందర్భంగా శివాజీ పేరుతో లాభాలు సంపాదించుకుంది.