ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విధి నిర్వహణలో మాఫియాడాన్‌ను ఎదుర్కోబోయో క్రమంలో ఆయన తమ్ముడిని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత మాఫియాడాన్ పోలీసు అధికారిపై పగతీర్చుకుంటాడు. ఈ నేపథ్యంలో జరిగే కథాగమనమే `అగ్గి`. హిందీలో `ఆగ్`, ఒకరకంగా చెప్పాలంటే `అగ్గి`కు అంత పవర్‌లేదు. నీళ్ళుపడి చల్లబడిపోయిందని చెప్పాలి. తెలుగువెర్షన్ ఆడియో కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతున్నప్పుడు అగ్గితో ఉన్న కాగడాలను చుట్టూరా పెట్టారు.
కానీ ప్రారంభమయ్యే సమయానికి తేలికపాటి వర్షం పడి కొన్ని కొండెక్కాయి. అయినాసరే ఈ అగ్గి మాత్రం మండుతూనే ఉంటుదని రాంగోపాల్‌వర్మను పొగడ్తలతో వక్తలు ముంచెత్తారు. ఇక అమితాబ్‌బచ్చన్ మాత్రం గబ్బర్‌సింగ్ పాత్ర వేయడం తన చిరకాల కోరిక అని ప్రకటించారు. ఆ రోజుల్లో మనస్సులో ఉన్న కోరికను వెళ్ళగక్కలేక హీరోగా చేశానని చెప్పాడు. మరి అప్పుడు చేసి ఉంటే `షోలే` వేరుగా ఉండేది. కానీ ఇంత వయస్సువచ్చాక ఆ పాత్రను పడించలేకపోయారు.
కథ: అందరికీ తెలిసిన `షోలే` కథను కొత్తగా చెబుదామనుకునే తాపత్రయంలో తీసిన చిత్రమిది. నరసింహా (మోహన్‌లాల్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఓసారి ఓ వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేస్తాడు. అతను మాఫియాడాన్ బబ్బర్‌సింగ్ (అమితాబ్)కు సోదరుడు. దీంతో తన తమ్ముడ్ని చంపిన పోలిస్ అధికారిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా అతని ఫ్యామిలీని చంపేసి నరసింహ వేళ్ళను కత్తిరిస్తాడు. `షోలే`లో సంజీవ్‌కుమార్ పాత్ర అది.