నిజంగా చందమామలాంటి కథే. కానీ కృష్ణవంశీ చెప్పే విధానంతో కొంత గందరగోళం కన్పించింది. ఓ గ్రామంలోని కామందు ఎస్.వి.రంగారావు (నాగబాబు), ఆయుర్వేదం గొప్పతనాన్ని చాటిచెప్పే వ్యక్తి అతను. అతనికి మహాలక్ష్మీ (కాజల్ అగర్వాల్) అనే కూతురుంటుంది. భార్యలేదు. ఆయుర్వేదమంటే ఇష్టపడే శిష్యులుంటారు. అది గ్రామం కదా... అందుకే పట్టణంలో పై చదువులు చదివించడానికి ఆమెను పంపిస్తాడు తండ్రి. అదే ఊరిలో మరో భూస్వామి రామలింగేశ్వరరావు (ఆహుతి ప్రసాద్) కుమారుడు దొరబాబు (శివబాలాజీ) కూడా అక్కడే చదువుతాడు.
చదువు పూర్తయ్యాక తిరిగి గ్రామానికి ఇద్దరూ వస్తారు. వారు రాగానే ఇద్దరినీ ఒకటి చేయాలనేది పెద్దల తాపత్రయం. అన్నట్లుగానే నిశ్చితార్థంవరకు తీసుకెళతారు. కానీ మహాలక్ష్మీ మనస్సులోని మాటను దొరబాబుకు ఓ రోజు చెబుతుంది. తాను పట్టణంలో చదువుతున్నప్పుడే ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ కిషోర్ (నవదీప్)తో ఏర్పడిన పరిచయం తనను తాను అర్పించుకునే స్థాయికి వెళ్లిందనే విషయాన్ని చెబుతుంది.
కానీ అతను తనను ప్రేమించడంలేదనీ కేవలం కోరిక కోసమే అప్పుడప్పుడు దగ్గరకు రమ్మన్నాడనీ, దీంతో అసహ్యంతో ఈ ఊరు వచ్చానని విశదపరుస్తుంది. దీంతో బాగా ఆలోచించి ఈ విషయాలు పెద్దలకు తెలీయకుండా మేనేజ్‌చేస్తూ దొరబాబు ఏంచేశాడనేది మిగిలిన కథంతా. ఇందులో సింథుమీనన్ పాత్ర ఏమిటి? అనేది కూడా చూసి తెలుసుకోవాల్సిందే.
ఒకరకంగా ఇది మల్టీస్టారర్ చిత్రమనే చెప్పాలి. నవదీప్, శివబాలాజీలు ఇద్దరూ విడివిడిగా హీరోలుగా చేసిన వాళ్ళే. కానీ వాళ్ళకు ఇంతవరకు సరైన హిట్ రాలేదు. అందుకనేమో ఇద్దరినీ కలిపి కృష్ణవంశీ తీశాడనిపిస్తుంది. ఆయనకూ ఈ మధ్య పెద్దగా హిట్‌లు లేవు. మొత్తంగా నవదీప్, శివబాలాజీ నటనాపరంగా బాగా చేశారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పటి అమ్మాయిలా చాలా ఫాస్ట్‌గా ఉండే పాత్రలో సింధుమీనన్ నటించింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రను బాగానే పోషించింది.