వైజయంతీ మూవీస్ పతాకంపై మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ నటించిన తొలి చిత్రం చిరుత విడుదలయింది. కథలో అంతగా పట్టులేకపోయినప్పటికీ డాన్స్, ఫైట్స్ తదితర విషయాల్లో చరణ్ మెప్పించాడనే చెప్పాలి.
ఇక కథ విషయానికి వస్తే... తన తండ్రిని చంపిన వ్యక్తిని వెతికి అతనిపై ప్రతీకారం తీర్చుకోవటమే. దీంతో తొలిషాట్ తోనే హింస ప్రారంభమవుతుంది. రామ్ చరణ్ ఓ గైడ్. ఇది జగదేకవీరుడు- అతిలోక సుందరి చిత్రంలోని మెగాస్టార్ పాత్రను గుర్తుచేస్తుంది.
ఇంకా చెప్పాలంటే బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కూడా కొన్ని సన్నివేశాల్లో తలపించే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద తొలి ప్రయత్నంలో చరణ్ సఫలమయ్యాడు.
కథలోకి మరింత లోతుగా వెళితే.... చరణ్( రామ్ చరణ్) తండ్రి సూర్య ఓ ఆటోడ్రైవర్. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఓ పాత్రికేయుణ్ణి మట్టూభాయ్ (ఆశిష్ విద్యార్థి) ముఠా హతమారుస్తుంది. దీనిని ఎదుర్కొన్న సూర్యను సైతం హత్య చేస్తారు.
ఈ దాడిలో చరణ్ తల్లి తీవ్రంగా గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంటుంది. అప్పటికి పదేళ్లలోపువాడు చరణ్. తన తల్లిని బతికించుకునేందుకు తన కుటుంబానికి దగ్గరివాడైన వెంకటేశ్వరరావు(భరణి) ఇచ్చిన సలహాతో చేయని నేరాన్ని తనపై వేసుకుని జైలుకు వెళతాడు.
జైల్లోనే విద్యా బుద్ధులు నేర్చుకున్న చరణ్, జైలు నుంచి విడుదలయిన తర్వాత తల్లి విషయాన్ని వెంకటేశ్వరరావుని అడుగుతాడు. ఆమె చనిపోయిందని చెపుతాడు. ఇలా సంభాషణ సాగుతుండగా ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న వెంకటేశ్వరరావును బ్యాంకాక్‌లో ఉద్యోగం చేసేందుకు ఓ వ్యక్తి కావాలంటూ అవతలి వ్యక్తి అడుగుతుంటాడు.
ఆ ఉద్యోగాన్ని చరణ్‌ని చేయమని సలహా ఇవ్వటం, అందుకు చరణ్ సిద్ధమైపోవటం అన్నీ జరిగిపోతాయి. ఓ రోజు రోడ్డుపై అతివేగంగా వెళుతూ, ఫ్లాట్‌ఫాంపై ఉన్న వస్తువులను అన్నింటినీ గుద్దేస్తున్న ఓ కారును అటకాయిస్తాడు చరణ్. తీరా చూస్తే అందులో ఓ అమ్మాయి(నేహా శర్మ) ఉంటుంది.
సంజన (నేహా శర్మ)ను చూసిన చరణ్ తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇదిలా ఉండగా బ్యాంకాక్‌లో ఉద్యోగం రావటంతో అక్కడికి వెళతాడు చరణ్. అక్కడికి అనుకోకుండా ఓ ధనవంతురాలైన అమ్మాయి ఫ్రెండ్స్ తోసహా వస్తుంది. ఆమె సంజన కావటంతో చరణ్ ఆ అమ్మాయికి బ్యాంకాక్ అందాలను చూపించే పనిలో పడతాడు. ఇలా వెళుతున్నప్పుడు రోడ్డులో ఓ వ్యక్తి సంజనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అతడిపై చేయిచేసుకుంటాడు చరణ్. ఇలాంటి మరో సంఘటనలో సంజనను రక్షించేక్రమంలో ఓ బోటులో పారిపోతాడు. అలా ఇద్దరూ ఓ దీవికి చేరుకుంటారు.
ఆ దీవిలో కేవలం వారిద్దరే ఉండటంతో ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. తన గతాన్ని గురించి వివరిస్తాడు చరణ్. చరణ్ గతం తెలుసుకున్న సంజన అతడిని విడిచి వెళ్లనంటుంది. తండ్రి వచ్చినప్పటికీ రానంటుంది. ఈలోగా సంజనను విలన్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆమెను ఎలా దక్కించుకున్నాడు, తన తండ్రిని వ్యక్తిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న విషయాలను వెండితెరపై చూడాల్సిందే.