స్నేహ మాధుర్యాన్ని చాటిచెప్పే "నవవసంతం"
శనివారం, 10 నవంబర్ 2007( 16:59 IST )
నటీనటులు : తరుణ్, ప్రియమణి, అంకిత, ఆకాష్, రోహిత్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం తదితరులు...
సంగీతం: ఎస్.ఎ. రాజ్‌కుమార్
నిర్మాతలు : ఎన్.వి. ప్రసాద్, పారాస్ జైన్
దర్శకత్వం : షాజహాన్
"పున్నగైదేశం" అనే తమిళ సినిమా ఆధారంగా మెగా సూపర్‌గుడ్ పతాకంపై... తెలుగులో పునర్నిర్మించిన చిత్రమే "నవ వసంతం". స్నేహం గొప్పదనాన్ని, మాధుర్యాన్ని చాటిచెప్పే కథాంశంతో అందంగా రూపుదిద్దుకుందీ చిత్రం. మహిళా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకునే చిత్రంగా కూడా ఉంటుంది.
ఇక కథలోకెళ్తే....
గణేష్ (తరుణ్) చిన్నతనంలో... తల్లి (సుధ) చివరి దశలో ఉండగా... తన ఆస్తినంతా తన తమ్ముడైన (ఆహుతి ప్రసాద్‌కు) ఇచ్చేసి దానికి బదులుగా అతడి కూతురిని తన కొడుక్కిచ్చి పెళ్లి చేయమని కోరుతుంది. ఆస్తితోపాటు కూతుర్ని తీసుకుని పట్నంలో సెటిలవుతాడు ఆహుతి ప్రసాద్. తల్లి చనిపోయిన తరువాత మామయ్యని వెతుక్కుంటూ వచ్చిన గణేష్‌కు అతడి నుండి తిరస్కారం ఎదురవుతుంది.
ఆ సమయంలో స్నేహితులైన (సునీల్, ఆకాష్, రోహిత్‌లు) అతడికి ఆశ్రయం ఇస్తారు. తమ కష్టాలు గణేష్‌కు తెలీకుండా అతడిని ఆదరిస్తాడు స్నేహితులు. అందులో ఒక్కోరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. కానీ వారికి చేయూత నిచ్చేవారే కరువవడం తెలుసుకున్న గణేష్ వారిని ప్రోత్సహిస్తాడు. స్నేహితులు కన్న కలల్ని నిలబెట్టి తన మరదలు అంజలి (ప్రియమణి) మనసును కూడా గెలుచుకుంటాడు గణేష్.
కథ పాతదే అయినప్పటికీ.... ట్రీట్‌మెంట్ కొత్తదని దర్శక నిర్మాతలు ప్రతిసారీ చెబుతుంటారు. కానీ ఈ సినిమా మాత్రం అలాంటిదే. పాత్రలు బలమైనవి కావడంతో కథాగమనంలో ఒక్కోసారి ట్రాక్ తప్పినా చెల్లిపోతుంది. సునీల్ కామెడీ ప్రేక్షకులకు పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశం వెంకటేష్ నటించిన "రాజా" సినిమాని జ్ఞప్తికి తెచ్చినా... ఈ కథకి ఇదే సరైన ముగింపు అనిపిస్తుంది.
స్నేహితులు ఒకరి కోసం మరొకరు చేసుకునే త్యాగాలు ఆకట్టుకుంటాయి. నగరంలో నిరుద్యోగుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుందీ చిత్రం. ఛాలెంజ్ చేసిన తరువాత హీరో ఒకే పాటలో ఎత్తుకు ఎదిగిపోకుండా సామాన్యుడిగానే ఉంచడం కథ ఔచిత్యాన్ని కాపాడింది. హింస, రక్తపాతంతో విసిగిపోయిన ప్రేక్షకులికి ఈ చిత్రం మంచి రిలీఫ్‌నిస్తుంది.
చాలాకాలం తరువాత ఛాలెంజింగ్‌గా తీసుకున్న తరుణ్ తన పాత్రలో బాగానే నటించాడు. కాస్త గ్యాప్ రావడంతో పాటల్లో కాస్త చురుకుదనం తగ్గినట్లు అనిపించింది. ప్రియామణి నటనలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆకాష్, రోహిత్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. సహజంగానే సునీల్ కామెడీ నవ్వించినా సెంటిమెంట్ సీన్‌లను బాగా రక్తికట్టించాడు.