గోపీచంద్, భావన, ఆలీ, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, షాయాజీ షిండే ఆశిష్ విద్యార్ధి, సుప్రీంత్ రెడ్డి తదితరులు. నిర్మాత: పోకూరి బాబూరావు, దర్శకుడు: బి.వి.రమణ.
ఈతరం ఫిలిమ్స్ అనగానే సామాజిక ప్రయోజనాలు, అభ్యుదయ చిత్రాల నిర్మాణ సంస్థగా అందరికీ తెలిసిందే. 'యజ్ఞం' చిత్రం కాస్త ఆ ధోరణి నుండి పక్కకు వచ్చినట్లుంది. ఆ మధ్య 'ఒంటరి' ఆడియో కార్యక్రమంలో నిర్మాత పోకూరి బాబూరావు అన్నట్లు ఈతరం బేనర్ ఈనాటి తరం అనుగుణంగా ఉంటుంది. పాటలు కూడా అలానే ఉన్నా ఈ తరం లిమిట్స్ దాటదు అన్నారు. అందులో ఈనాటి తరానికి బాగా తెలిసిన 'గజని', ఆ మధ్య కొద్దికాలం వడ్డే నవీన్ నటించిన 'నా ఊపిరి' చిత్రాలు 'ఒంటరి'లో ఛాయలు ప్రస్పుటంగా కన్పిస్తాయి.
కథ: వంశీ(గోపీ చంద్) , వీర్రాజు (సుప్రీంత్) లాల్ మహంకాళి (గూండా) మనిషిని రివాల్వర్‌తో కాల్చి చంపడంతో సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా సాగుతుంది. వంశీ కృష్ణ (గోపీచంద్) విశాఖపట్నంలో కట్టుబాట్లున్న ఉమ్మడికుటుంబానికి చెందిన యువకుడు. వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తుంటాడు. కనకమహాలక్ష్మి అలియాస్ బుజ్జి (భావన) అనే కాలేజీ అమ్మాయిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌గా ప్రేమించేస్తాడు. ఆమె అనాధ. అందుకోసం తానూ అదేనని చెప్పి సి.బి.ఐ. ఆఫీసర్‌నని అబద్దమాడి పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఆమె ద్వేషిస్తుంది.
ఆ తర్వాత పాండా (అజయ్) అనే గూండా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అతడికి బుద్ది చెప్పి ప్రేమను పొందుతాడు. ఇక హైదరాబాద్‌లో గూండా అయిన లాల్ మహంకాళి (ఆశిష్ విద్యార్ధి) తమ్ముడే ఈ పాండా. తన తమ్ముడికి జరిగిన అవమానానికి పగతో వంశీ, బుజ్జిల ప్రేమలో చిచ్చుపెడతాడు. దీంతో వంశీ ఒంటరి అవుతాడు. తన స్థితికి కారణాన్ని తెలుసుకొని ఎవరెవరిని ఏం చేశాడో అనేది మిగిలిన కథ.
|