పూరీజగన్నాథ్ దర్శకుడిగా ప్రభాస్, త్రిష జంటగా తెరకెక్కిన చిత్రం బుజ్జిగాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి కె.ఎస్. రామారావు నిర్మాత. ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో మోహన్‌బాబు, కోటశ్రీనివాసరావు, సునీల్, జయప్రకాష్‌రెడ్డి, అలీ, ఎమ్మెస్ నారాయణ, అజయ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, హేమ, సుధ తదితరులు నటించారు.
హిట్ చిత్రాల దర్శకుడిగా క్రెజ్ సంపాధించుకున్న పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బుజ్జిగాడు చిత్రం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అర్ధం లేని కథకు ఆర్భాటాలు జోడించడం అంటే ఇదే అని చెప్పవచ్చు. టైటిల్‌లో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అనిపెట్టినందుకు హీరోను తమిళ వాసనతో చూపించడం బాగున్నా కథపై మరింత శ్రద్ధ పెట్టుంటే బాగుండేది.
ఆంధ్రాలో పుట్టిన హీరో చిన్నతనంలో చెన్నై పారిపోయి 12 ఏళ్ల తర్వాత తన ప్రేమించిన అమ్మాయి కోసం తిరిగిరావడం, ఆసమయంలో చుట్టుముట్టిన సమస్యలనుంచి బయటపడి ప్రియురాలి చెయ్యిపట్టుకోవడం... అనేది చిత్రంలోని పాయింట్.
కథ విషయానికోస్తే విశాఖపట్నంలోని ఓ కాలనీలో ఉండే హేమ, ప్రభాస్‌రాజు (ఎం.ఎస్.నారాయణ)ల కొడుకు లింగరాజు అలియాస్ బుజ్జిగాడు(ప్రభాస్). ఆ ఇంటిపక్కనే ఉన్న ఆహుతీప్రసాద్ కూతురు చిట్టి (త్రిష). చిట్టి, బుజ్జిగాడు చిన్ననాటి నుంటి మంచి స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్నేహం వారిది. ఓ సందర్భంలో చిట్టితో గొడవ రావడంతో బుజ్జిగాడు ఇంటినుంచి పారిపోయి చెన్నై చేరుకుంటాడు.
అక్కడే దాదాపు 12 ఏళ్లు ఉండిపోయిన బుజ్జిగాడు సూపర్‌స్టార్ రజినీ అభిమానిగా పెరుగుతాడు. అయితే తన చిన్ననాటి స్నేహితురాలు చిట్టి గుర్తుకురావడంతో మళ్లీ విశాఖపట్నానికి చెరుకుంటాడు. అయితే ఈ సమయంలో తన స్నేహితుడు సత్తి(సునీల్)ను ఆదుకోబోయి జైలుకు వెళ్తాడు. అక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు బుజ్జిగాడి దగ్గరకు వచ్చి ఓ వ్యక్తిని చంపితే కోటిరూపాయలిస్తామంటూ బేరం పెడతారు.
చంపాల్సింది మాఫియా డాన్ శివన్న(మోహన్‌బాబు) ని అని వారు చెబుతారు. దాంతో బుజ్జిగాడు శివన్నను చంపడానికి ఒప్పుకుంటాడు. అందుకోసం అతను హైదరాబాద్ చేరుకుంటాడు. తన చిన్ననాటి స్నేహితురాలు చిట్టి కూడా హైదరాబాద్‌లోనే ఉందని బుజ్జిగాడికి తెలుస్తుంది. ఓ సమయంలో శివన్నపై దాడి చేసిన బుజ్జిగాడు ఆతనికే బంధీ అవుతాడు.