'దేవదాసు'లో తన ప్రేమకోసం హీరో రామ్ అమెరికా పయనమైతే... 'రెడీ'లో యూఎస్ నుంచి వచ్చిన ఓ అమ్మాయిని సొంతం చేసుకోవటానికి నానా తంటాలు పడతాడు. దర్శకుడు శ్రీను వైట్ల 'ఢీ' చిత్రంలో చిత్రీకరించిన మైండ్ గేమ్ మరోసారి 'రెడీ'లోనూ కనబడింది. 'ఢీ'లో హీరోతో కలిసి హీరోయిన్ జెనీలియా తన అన్న శ్రీహరితో ఆడిన మైండ్ గేమ్ ఆకట్టుకున్నట్లే రెడీ సెకండాఫ్‌లో రామ్, జెనీలియా మేనమామలతో ఆడిన మైండ్ గేమ్ ఆకట్టుకుంటుంది. ప్రధమార్థంకన్నా ద్వితీయార్థంలో కథనాన్ని ఢీ తరహాలో నడిపించి దర్శకుడు చిత్రాన్ని రక్తి కట్టించాడు. అందులో మూర్తిగా నటించిన బ్రహ్మానందం పాత్ర కథానాయకునికి ఎంత సహాయపడిందో... ఇందులో మెక్ డొనాల్ మూర్తి అంతగా సహకరించింది.
ఇక కథలోకి వస్తే.... చందు (రామ్) కాలేజీ స్టూడెంట్. ఉమ్మడి కుటుంబం. తన మేనకోడలు (తమన్నా) ప్రేమించిన వ్యక్తికి కట్టబెట్టేందుకు తన కుటుంబం ఆర్భాటంగా చేసిన పెళ్లి నుంచి తప్పించి చందు అందరికీ షాక్ ఇస్తాడు. దీంతో తన కుటుంబానికి ముఖ్యంగా తన పెదనాన్న ఆగ్రహానికి గురై స్నేహితుల వద్దకు తన మకాం మారుస్తాడు.
మరో స్నేహితుడు ప్రేమించిన అమ్మాయిని ఒక్కటి చేయడంకోసం కళ్యాణమండపం నుంచి పూజ(జెనీలియా)ను తీసుకువస్తాడు రామ్. కానీ తన స్నేహితుడు గుడిలో వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటుండగా నిలదీస్తే... తను పొరపాటున వేరే అమ్మాయిని తెచ్చానని గ్రహిస్తాడు. ఇక అక్కడ నుంచి పూజ తనను కర్నూల్లో తన స్నేహితురాలి ఇంటికి తీసుకుని వెళ్లమంటుంది. ఇది తెలిసిన పూజ వర్గీయులు రామ్ బృందాన్ని వెంబడిస్తారు.
అలా వారంతా అడవిగుండా పారిపోయి కర్నూలుకు చేరతారు. తీరా అక్కడకు వెళితే పూజ స్నేహితురాలు వుండదు. దీంతో... పూజ అసలు విషయం చెపుతుంది. తను అమెరికా నుంచి వచ్చాననీ.. పాస్‌పోర్టు పోవటం వల్లే తన స్నేహితురాలు వద్ద ఓ పదిహేను రోజులు వుందామనుకున్నాని చెపుతుంది. చందు తన తెలివితేటలను వుపయోగించి పూజను తన ఇంటిలో వుండేలా చేస్తాడు. అక్కడ వారి ఆప్యాయతలు చూసి వారితో కలిసి ఉండిపోవాలనుకుంటుంది పూజ.
చివరికి చందు, పూజల విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని ఒకటి చేయాలనుకుంటారు. వారు అనుకున్న ఆశయం నెరవేరిందా...? చందు, పూజల వివాహం జరిగిందా.... అనే విషయాలను వెండితెరపై చూడాల్సిందే. మొత్తమ్మీద చూస్తే... రామ్ దేవదాసు చిత్రంలో ఎంత ఎనర్జిటిక్‌గా కనిపించాడో ఇందులోనూ అంతే పవర్‌ఫుల్‌గా కనిపించాడు. పూజ పాత్రలో జెనీలియా గ్లామరస్‌గా కనిపించింది. ఈ చిత్రంలో రామ్, జెనీలియాతోపాటు కోట, జయప్రకాష్ రెడ్డి, సునీల్, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్, పృథ్వీ తదితరులు నటించారు.