బాలుకు ముగ్గురు పిల్లలు. అంతా క్రిష్టియన్ స్కూల్లో చదువుతుంటారు. పిల్లలకు ఫీజులు కట్టలేని స్థితి. మేకలు, గొర్రెలు అమ్మి కడతానని వాయిదా వేస్తుంటాడు. ఏమీ చేయలేకపోయినా అన్నీ ఉన్నవాడిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండేరకం. ఆ చుట్టుపక్కల టీషాపు వ్యక్తిగా గుండు హనుమంతరావు, కిళ్ళికొట్టు వ్యక్తిగా గౌతంరాజు ఉంటారు. అలాంటి ఊరిలో ఓ రాత్రిపూట ఫకీరు వచ్చి ఈ ఊరికి మంచి రోజులు వచ్చాయంటూ... అరుచుకుంటూ వెళ్ళిపోతాడు. మనకు మంచి రోజులేంటని ఊరనుకుంటుంది.
ఆ మరుసటి రోజే ఊరిలో సూపర్ స్టార్ షూటింగని మేనేజర్ ఆలీ వచ్చి అక్కడి హోటల్ వాడికి, మటన్‌వాడికి, కూరగాయల వాడికి వేలకు వేలు డబ్బులు ఇస్తాడు. అనుకున్నట్లుగానే ఆ ఊరిలోకి సూపర్‌స్టార్ అశోక్ కుమార్ (రజనీ-టైటిల్లో ఇలానే వేశారు) వస్తాడు. నయనతార హీరోయిన్‌గా వస్తుంది. ఓ నెల రోజుల పాటు అక్కడే షూటింగ్. తమ అభిమాన నటుడుని చూడాలని ఆ ఊరితో పాటు పక్కఊరి జనాలు కూడా వచ్చి అశోక్ కుమార్ దర్శనం కోసం రాత్రిం బవుళ్లూ నిద్రహారాలు మాని చూస్తుంటారు.
అందరూ ఆయన్ను కలవాలనుకుంటారు. కానీ ఒక్క బాలకృష్ణ మాత్రం వెళ్లాలనుకోడు. బాలకృష్ణ, అశోక్ కుమార్‌లు బాల్యస్నేహితులని ఆవిడ భార్య మీనాకు, పిల్లలకూ తెలుసు. కానీ ఈ స్థితిలో తనను చూస్తే గుర్తుపడతాడో లేదో.. ఒక వేళ వెళితే నువ్వెవరవు? అని అడిగితే తట్టుకోలేను.. అంటాడు. ఎలాగో.. ఈ విషయం ఊరిజనాలకు తెలుస్తుంది. అప్పటి నుంచి బాలకృష్ణకు ఊరి జనం పలురకాల మంచి పనులు చేస్తుంటారు.
ఒక్కసారి సూపర్‌స్టార్‌తో ఫోటో దిగాలని, మాట్లాడాలని, టచ్ చేయాలని, ధర్మరాజులాంటి వారేమే.. కాల్షీట్ ఇప్పిస్తే సినిమా తీయాలని ఉబలాటపడుతుంటారు. దీనికి తోడు పిల్లల ఫీజును స్కూల్ ఫండ్‌లోనే కట్టేసిన ప్రిన్సిపాల్.. స్కూల్ వార్షికోత్సవం నాటికి సూపర్‌స్టార్‌ను తీసుకురావాలని కోరుతాడు. చేసేదిలేక.. అంగీకరిస్తాడు. ఫంక్షన్‌కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంటుంది. బాలకృష్ణ సూపర్‌స్టార్‌ని కలిసే ప్రయత్నం చేయలేదని తెలిసి.. ఇదంతా.. డ్రామా అంటూ లేనిపోని గొప్పలు చెప్పుకునేవాడిగా భావించి అందరూ ఈసడించుకుంటారు.
ఆఖరికి స్కూల్ గౌరవాధ్యక్షుడుగా ఉన్న ఆర్.ఎస్.అనే వ్యక్తి చొరవతో మంత్రిగారి ద్వారా సూపర్‌స్టార్ స్కూల్ ఫంక్షన్‌కు రావడానికి అంగీకరిస్తాడు. మరి బాలకృష్ణ స్నేహం ఉట్టిదేనా? ఆయన ప్రమేయం ఏమిటి? ఫంక్షన్‌కు వచ్చిన సూపర్ స్టార్ ఏం చేశాడు? బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ని కలిశారా? అన్నది క్లైమాక్స్‌లో చూడాల్సిందే.