ప్రస్తుతం తెలుగు సినిమాను కుటుంబ చిత్రాలకంటే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నవి.. యూత్ చిత్రాలే. "ఆనంద్" తర్వాత యూత్‌పై ప్రభావితం చూపింది... "హ్యాపీడేస్". కాలేజీ చదివే రోజులే హ్యాపీడేస్ అని శేఖర్ కమ్ముల నిరూపించారు. అదే బాటలో పయనిస్తూ.. హ్యాపీగా ఉండాలంటే కాలేజీ తర్వాతా కూడా ఉండొచ్చునని హరి ఎల్లేటి చెప్పారు.
అందుకే ఐదుగురు వ్యక్తుల స్నేహం, జీవితం అనేకథా వస్తువును ఎంచుకుని అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్‌గా తీర్చిదిద్దారు. పెద్దలు చెప్పినట్లు పిల్లలు వినేవారనేది గతం. పిల్లలు చెప్పినట్లే పెద్దలు మారాలనేది ప్రస్తుత పరిస్థితి. పుట్టిన ప్రతి మనిషి సుఖం, సంతోషాలతో జీవించాలని కోరుకుంటాడు. అలా సంతోషంగా జీవించడానికి ఐదుగురు స్నేహితులు ఏం చేశారనేది కథ.
ఇక కథలోకి వెళితే... అంకిత్ (నిఖిల్), పల్లవి (మేఘాబర్మన్), రాజా (సూర్య), గోపి (ప్రదీప్), సునీల్ (వేణు) స్నేహితులు. చిన్నతనం నుంచే ఒకే కాలనీలో ఉంటూ స్నేహితులుగా ఎదుగుతారు. ఐదుగురివి... ఐదు రకాల వ్యక్తిత్వాలు.. జీవితమంటేనే జాలీగా తిరగడం, మనకు నచ్చిన విధంగ బతకడమనేది అంకిత్ వ్యక్తిత్వం. అందుకే బి.ఎ.పై శ్రద్ధకన్నా గొప్ప సంగీత దర్శకుడ్ని కావాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఇదే విధంగా గోపీ కష్టపడి ఇంజనీరింగ్ చదివి విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనే తత్త్వాన్ని కలిగి ఉంటాడు. అనాథంటే ఆదుకునే వ్యక్తిత్వం రాజాది. తండ్రి డబ్బులిస్తే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటూ ఏది చేయాలో తెలియక సతమతమయ్యే వ్యక్తి సునీల్.
మరోవైపు తన మ్యూజిక్ కోసం శతవిధాలా ప్రయత్నాలు సాధించినా అంకిత్‌కు అవకాశాలు వచ్చినవి వచ్చినట్లే పోతుంటాయి. ఇలా... అంకిత్ చివరికి హోటల్లో వెయిటర్‌గా చేరుతాడు. ఆ విషయం ప్రేమించిన పల్లవికి కూడా చెప్పడు. ఈ విషయం తన స్నేహితుల ద్వారా పల్లవికి తెలిసి నిలదీస్తుంది.
మన మధ్యలో ఆ టాపిక్ రాలేదు కాబట్టి చెప్పలేదంటూ.. ఇది నా వ్యక్తిగతం. నేను ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం నీకు లేదంటాడు. అలా ఇద్దరి మధ్య పెరిగిన మాటల యుద్ధం చేయి చేసుకునే స్థాయికి వెళుతుంది. దీంతో నీకంటూ ఓ గోల్ లేదు. ప్రియురాలి కోసం కనీసం సిగరెట్ కూడా మానలేదు. నీది ప్రేమ కాదని కేవలం ఆకర్షణ అంటూ పల్లవి విడిపోతుంది. ఆ తర్వాత అంకిత్ ఏం చేశాడు? అతని జీవితం ఏమైంది? అనుకున్న గోల్ సాధించాడా? వీరిద్దరి ప్రేమలో మిగిలిన స్నేహితుల ప్రమేయం ఏమిటి?అనేది మిగిలిన కథ.