పాయింట్... మనిషికి కోటి ఆశలు. అవి ఎప్పటికీ తీరవు. అలాంటి ఆశలు గల ఓ యువకుడి జీవితకథే "నిన్న నేడు రేపు" చిత్రం. చిత్ర కథ ఇదంటూ... తనికెళ్ల భరణి వాయిస్‌ఓవర్‌తో చిత్రం ప్రారంభమౌతోంది.
ఇక కథలోకి వెళితే... విజయ్ (రవికృష్ణ) నిరుద్యోగి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను చూసి తాను గొప్పవాడిని కావాలని కలలు కంటూ... ఇంట్లో అమ్మానాన్నల పోరుపడలేక పల్లెనుంచి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడంతా వేగవంతమైన ప్రపంచం. జేబుల్లో డబ్బులుండవు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగిపోతాడు. అంతకు ముందు డబ్బే సర్వస్వమని డబ్బుంటే ప్రేమిస్తానంటూ.. ఆశ (తమన్నా) విజయ్‌కు దూరమవుతుంది.
ఉన్న రూపాయితో చివరిసారిగా తృప్తిగా సిగరెట్ తాగి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనతో ఓ అర్థరాత్రి రైల్వేట్రాక్‌పై అడ్డంగా పడుకుంటాడు విజయ్. రైలు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండగా, కొద్ది దూరంలో ఏదో వస్తువు వెలుగుతూ ఆరిపోతూ ఉండటం గమనిస్తాడు. దగ్గరగా వెళ్లి చూస్తే వైబ్రేషన్‌లో ఉన్న సెల్‌ఫోన్ అది.
పక్కనే మనిషి విగతజీవుడై రక్తపు మరకలతో పడి ఉంటాడు. ఒక్కసారిగా తెలీని భయంతో రవికృష్ణకు చెమటలు పట్టేస్తాయి. అతని జేబులు వెతికితే పర్సులో వేలరూపాయల నోట్లు, క్రిడిట్ కార్డులు కన్పిస్తాయి. దాంతో తను చావాలనుకున్న విషయాన్ని మర్చిపోయి, ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. ఒక్కొక్కరు చస్తూ ఎదుటివారికి మంచి చేస్తారనే పాలసీ అంటే ఇదేనేమోఅనుకుంటాడు. విజయ్.
ఇక అక్కడ నుంచి తన రూమ్‌కు వస్తాడు. ఆ రూమ్‌లో ఇద్దరు రూమ్‌మేట్స్ ఉంటారు. అందులో ఒకతను కష్టించి పనిచేసి అందులోంచి దాచుకుని మరో ఉన్నత ఉద్యోగానికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. మరొకడు బేవార్స్‌గా తిరుగుతూ... రూమ్‌మేట్ జేబులో డబ్బులు దొంగలిస్తూ... అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని గడిపే రకం.