పాయింట్.. మారిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా స్మగ్లింగ్ చేయడం.
ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకమైన ఏవీఎం సంస్థ నిర్మించింది. తమిళనాడులో "అయన్" పేరుతో ఇటీవలే విడుదలైన ఈ సినిమా తెలుగులో 'వీడొక్కడే' పేరుతో శుక్రవారం విడుదలైంది. "గజిని", "సూర్య సన్నాఫ్ కృష్ణన్" తర్వాత తెలుగు తెరకు వచ్చిన ఈ చిత్రం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీలేదు.
ఇక కథలోకి వెళితే.. దాస్ (ప్రభు)తో కలిసి హీరో సూర్య తండ్రి చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తుంటాడు. ఒక్కోసారి హత్యలు కూడా చేయాల్సివస్తుంది. ఆ క్రమంలో సూర్య తండ్రి మృత్యువాత పడతాడు. దీంతో ప్రభు ఆ వృత్తిని వదిలిపెట్టి షిప్‌యార్డ్‌లో చెత్త ఎత్తివేసే కాంట్రాక్ట్‌లు, పైరసీ వీడియోలు వంటి పనులు చేస్తుంటాడు.
సూర్య తండ్రి చనిపోవడంతో అతని కొడుకు సూర్యకు ప్రభు తనవద్దే పని కల్పిస్తాడు. కంప్యూటర్ పరిజ్ఞానం, డిగ్రీ విద్యార్హతలున్నా, స్మగ్లింగ్‌వైపు దృష్టిసారిస్తాడు సూర్య. అందులో భాగమే వజ్రాల స్మగ్లింగ్. సిటీలో పలుకుబడిగల వ్యాపారవేత్త దాస్ (ప్రభు)తో ఇటువంటి పనులు చేస్తుండగా, వాటిని సూర్య అమలు చేస్తాడు.
ఆ క్రమంలో తన ట్రూప్‌లో కొత్తగా చేరి స్నేహితుడైన ఓ వ్యక్తితో సూర్య ఆఫ్రికాదేశానికి వెళ్తాడు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఉగ్రవాద సంస్థల ద్వారా ఆ వజ్రాలను సూర్య పొందుతాడు. కానీ ఎప్పటికప్పుడు వీరి కదలికలు తెలిసిపోవడంతో.. వజ్రాలు మాయం కావడం.. మళ్ళీ వాటిని కనిపెట్టేందుకు రకరకాల సాహస విన్యాసాలు చేస్తుంటాడు సూర్య.
ఓ సందర్భంలో తన స్నేహితుడి చెల్లెలు తమన్నాను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. మరోవైపు సూర్య స్నేహితుడు వ్యతిరేక వర్గానికి తమ రహస్యాలు తెలియజేస్తున్నాడని తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి.
ఇదిలా ఉండగా.. అనుకోకుండా ఒకేసారి సూర్య అతని స్నేహితుడు కలిసి వజ్రాల పనిలో విదేశాలకు వెళుతుంటారు. ఆ సమయంలో సూర్య స్నేహితుడు చనిపోతాడు. అతనిని సూర్య కాల్చేస్తాడు. ఈ విషయం తెలిసి తమన్నా సూర్యను అసహ్యించుకుంటుంది. సూర్యపై కేసు పెడుతుంది. సూర్య ఎంత చెప్పినా వినదు. చివరికి సూర్య ఏం చేశాడు? తమన్నా అన్న ఎలా చనిపోయాడు? చివరికి సూర్య పరిస్థితి ఏమైంది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ.. గతంలో స్మగ్లింగ్ అనే అంశంపై రకరకాలుగా వివిధ సినిమాల్లో చూపించారు. విమానాల్లో వజ్రాలను స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ వారికి చిక్కిపోకుండా హీరో కొత్తదనంగా చేసిన ప్రయత్నం ఆకట్టుకుంటుంది. అదేవిధంగా తన ప్రత్యర్థులు కోడ్ భాషలో స్మగ్లింగ్ చేయడం, దాన్ని తెలిసి సూర్య ఎలా డీకోడ్ చేయగలిగాడు అనేది సాంకేతిక పరిజ్ఞానంతో బాగా చేశాడు.
ఇక ఫైట్స్ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. పాటలు ఏమాత్రం సందర్భానుసారంగా లేవు. చిత్రంలో అంతా తమిళనటులే ఎక్కువ. తమన్నా పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు.
మొదట్లో ఉగండా, లెబనాన్ వంటి దేశాల్లో ఉగ్రవాద నాయకులను చూపుతూ.. ఏదో పెద్ద సస్పెన్స్ చిత్రంగా దర్శకుడు క్రియేట్ చేశాడు. పతాక సన్నివేశంలో సూర్య ఆసుపత్రి పాలుకావడం, వెంటనే ఆఫ్రికా దేశానికి వెళ్ళి విలన్‌ను అడ్డుకోవడం వంటివి విడ్డూరంగానూ వింతగానూ ఉన్నాయి.
తెలిసిన కథతో భిల్లాను ఎంత రిచ్‌గా తీశారో.. అదేవిధంగా వజ్రాల స్మగ్లింగ్ అనేదాన్ని అంత రిచ్‌గానూ ఈ చిత్రంలో చూపారు. మొత్తానికి ఈ చిత్రాన్ని చూస్తుంటే ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు. ఇంతకంటే చెప్పడానికి ఏమీలేదు. మరి "వీడొక్కడే" ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే..!