నటీనటులు : మంచు మనోజ్ కుమార్, హారిక బ్రహ్మానందం, కైలాష్ తదితరులు, నిర్మాత : సీత యేలేటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సంభాషణలు : చంద్రశేఖర్ యేలేటి, సినిమాటోగ్రఫీ : సర్వేష్ మురారి, పతాకం : ఆర్యకి ఆర్ట్స్, పాటలు : అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్ : మోహన రామారావు.
అనుకోకుండా ఒకరోజు, ఐతే వంటి వైవిధ్య కథాంశాలను తెరకెక్కించిన దర్శకుడు యేలేటి. విభిన్న స్క్రిప్ట్‌తో హాలీవుడ్ తరహా చిత్రాలను మనమూ తీయగలమని నిరూపించిన యేలేటి.. "ప్రయాణం" అనే సినిమాను కూడా ఇదే కోవలోనే తెరకెక్కించాడు. కేవలం ఐదు పాత్రల చుట్టూ ఎయిర్‌పోర్టులోనే రెండుగంటల పాటు కథను నడిపించడం సాహసమే.
ఇక కథలోకి వెళితే.. ధృవ్ (మనోజ్), కైలాష్, రామన్ ముగ్గురు బాల్య స్నేహితులు. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరికి పందాలు కాయడం కూడా సరదా. అలా ఓసారి పందెంకాసి మలేషియాలో ఎతైన బ్రిడ్జిని ఎవరైతే ఎక్కి దిగుతారో? వారి లగేజీని ఓడివారు మోయాలని బెట్టు కడతారు.
ఈ క్రమంలో మనోజ్‌తో పాటు అతడి స్నేహితులందరిని సంఘ విద్రోహులని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ తర్వాత వివరాలు తెలుసుకుని వదిలేస్తారు. అక్కడ నుంచి మలేషియా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి సింగపూర్ వెళ్ళాలని అనుకుంటారు. అదే సమయంలో హారిక అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇండియా వెళ్లడానికి తన స్నేహితురాలితో వస్తుంది.
హారిక చేరాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యమవుతుంది. ఈలోగా హారిక అక్కడున్న షాపులన్ని తిరిగి షాపింగ్ చేస్తుంటుంది. ఇదే టైమ్‌లో ధృవ్ స్నేహితులు మరో పందెం కాస్తారు. పక్షి ఈకను ఊదుతూ కిందపడకుండా గేటువరకు తీసుకెళ్ళాలన్నదే బెట్.
ముందుగా ధృవ్ ప్రారంభిస్తాడు. అలా ఊదుతూ వెళుతుండగా.. యాదృశ్చికంగా అటుగా వస్తున్న హారికను గుద్దుతాడు. అలా తనకు తెలీయకుండా ఆమెను పట్టుకుని పక్షి ఈకను ఊదుకుంటూ గమ్యాన్ని చేరతాడు. ఆ తర్వాత ఆమెను చూసి లవ్ ఎట్ ఫస్ట్‌సైట్‌లా ప్రేమించేస్తాడు.
ఈ విషయం ధృవ్ స్నేహితుల్లో సైకాలజీ తెలిసిన రామన్ గ్రహించి రెండు గంటల్లో ఆమెను ప్రేమించేట్లు చేయమని సూచిస్తాడు. దాంతో సింగపూర్ టికెట్‌ను ధృవ్ కాన్సిల్ చేసి హారిక వెళ్ళే హైదరాబాద్‌కు టికెట్ మార్చుకుంటాడు. మరోవైపు బ్రహ్మానందం ఊరికెళ్ళడానికి ఎయిర్‌పోర్టుకు వస్తాడు.
వచ్చిరాగానే ధృవ్ స్నేహితులు బ్రహ్మానందాన్ని పరిచయం చేసుకుని స్నేహితులుగా మార్చుకుంటారు. కానీ అదే బ్రహ్మానందానికి మైనస్ అవుతుంది. అది ఏమిటి? మరి రెండు గంటల్లో హారికను ధృవ్ ప్రేమించేట్లు చేశాడా? అనేది మిగిలిన సినిమా.