తొలి పరిచయంలోనే హీరో హీరోయిన్‌ను ప్రేమించేయడం. ఆ తర్వాత ఆమె కాదన్నా ఒప్పించేలా చేయడం... ఆ విషయం పెద్దలకు తెలియడం. ససేమిరా అనడం... ఆ తర్వాత నాలుగు ఫైట్లు, పాటలు, వెరసి క్లైమాక్‌లో ప్రేమ ఎప్పుడూ సజీవమే అనే ముగింపు... ఈ రకమైన రొటీన్ చిత్రాలకు "కరెంట్" భిన్నమైన చిత్రమేమీకాదు.
పాజిటివ్ నెగెటివ్ టచ్‌తోనే కరెంట్ పుడుతుంది. ఈ పాయింట్‌తో హీరోయిన్ చూడగానే హీరోలో కరెంట్ పుట్టి ఆమెను ప్రేమించేస్తాడు. కొన్ని మనస్పర్థలవల్ల అతని జ్ఞాపకాలు మనస్సులో నిక్షిప్తం అయితే వాటిని చెరిపేసి నీ ప్రేమను నువ్వే తీసుకో- అనేది కొత్త ట్విస్ట్. అదేమిటో తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే.
ఇక కథలోకి వెళితే... తరచూ ట్రాన్స్‌ఫర్లు అవుతూ ఒక ఊరికి తన కుటుంబంతో వస్తాడు సర్వే ఆఫీసర్ తనికెళ్ళభరణి. అతని భార్య సుధ, కొడుకు సుశాంత్. రేపటి గురించి ఆలోచించక నేటిగురించే యోచించే క్యారెక్టర్ సుశాంత్‌ది.
ఇక హీరోయిన్ జడ్జి చరణ్‌రాజ్ కుమార్తె స్నేహ (స్నేహా ఉల్లాల్). ఈమె తన స్నేహితురాలితో రోజూ జాగింగ్ చేస్తుంటుంది. స్టేషన్ నుంచి వస్తూ... అదే మార్గంలో వెళ్ళే సుశాంత్ ఒక్కసారి స్నేహమాటలను విని తొలిచూపులోనే ప్రేమించేస్తాడు.
అదేఊరిలోని ఒకేకాలేజీలో ఒకే సెక్షన్‌లో ఉన్న స్నేహను చూసి పరిచయం గల వ్యక్తిగా మాటలతో ఆకట్టకునే ప్రయత్నం చేస్తాడు. స్నేహకు ఇష్టంలేకపోయినా ట్రిక్కులు ఉపయోగించి ఆమెను ప్రేమించేలా చేస్తాడు.
స్నేహ తండ్రి ఆమెకు విదేశాల్లో ఉన్న తన బంధువుల అబ్బాయిని పెండ్లికొడుకుగా ఫిక్స్ చేస్తాడు. నీ ఇష్టమే తన ఇష్టమని మొదట చెప్పిన తండ్రితో స్నేహ, సుశాంత్ గురించి చెబుతుంది. సరేనని సుశాంత్‌ను ఇంటికి ఆహ్వానిస్తాడు చరణ్‌రాజ్. సుశాంత్‌కు జీవితంపై సరైన అవగాహనలేకపోవడం, భవిష్యత్ గురించి ఆలోచలేకపోవడం వంటి క్వాలిఫికేషన్లు గమనించిన చరణ్‌రాజ్ ససేమిరా అంటాడు.
అప్పటికే ప్రేమలో మునిగిపోయిన స్నేహా.. సుశాంత్ ఎన్ని తప్పులుచేసినా క్షమిస్తుంది. ఇక మారడని తెలుసుకుని 'నా మనసులో ప్రేమను పుట్టించింది.. నువ్వే కనుక దాన్ని నా మనసులోనుంచి తీసివేయమని' కొత్త పాయింట్ ముందుంచుతుంది. అప్పుడు సుశాంత్ ఏంచేశాడు? ఆ తర్వాత కథాకమామిషు ఏమిటి? అనేది మిగిలిన సినిమా.