టేకింగ్, టెక్నికల్ వాల్యూస్‌తో పాటు కథలు కూడా పాశ్చాత్యబాట పడుతున్న తరుణంలో మన దేశానికి సంబంధించిన రాచరిక చరిత్రను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గొప్ప విషయం. స్టూడెంట్ నెం.1, యమదొంగ చిత్రాలతో ఎన్టీఆర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి ఈసారి చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
పరువు ప్రతిష్టల కోసం తలకాయలు నరుక్కోవడం ఫ్యాక్షనిజం అయితే, దేశాన్ని, రాజును, యువరాణిని కాపాడుకోవడం కోసం కరవాలంతో తలలు లేపేయడం వంటి రాచరిక చరిత్రతో "మగధీర" తెరకెక్కాడు.
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. పులి చంపిన లేడి నెత్తురు. ఎగరేసిన ఎర్రజెండా.." అని శ్రీశ్రీ అభివర్ణించాడు. రాచరిక వ్యవస్థలో వీరోచిత పోరాటాలు, గగుర్పాటు కలిగించే విన్యాసాలు చాలా ఉంటాయి. రాజ్యం కోసం సర్వసైన్యాధ్యక్షుడు పణం అడ్డుగా పెడతాడు.
అలా తరతరాలుగా రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే శతధృవవంశీయునికి చెందిన కాలభైరవుడు (రామ్‌చరణ్). క్రీ.శ. 1609లో ఉదయ్‌ఘడ్ రాజ్యాన్ని ఎలా కాపాడి, చివరికి కాలాన్ని కూడా జయించి, 400 ఏళ్ళనాటి ప్రేమను ఈ జన్మలో ఎలా దక్కించుకున్నాడన్నదే "మగధీర" చిత్ర కథాంశం.
"చావులోనైనా తోడు ఇవ్వవా..?" అంటూ యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్) భైరవుడిని తన చేతిలోకి తీసుకుంటూ ఆరావళి పర్వాతాల్లో పడి చనిపోవడం, ఆమెనే భైరవుడు అనుసరించడంతో కథ ప్రారంభమౌతుంది.
మరోవైపు హైదరాబాదులో హర్ష (రామ్‌చరణ్ తేజ) బైక్ రేసుల్లో పాల్గొని డబ్బులు సంపాదిస్తుంటాడు. అతని తల్లిదండ్రులు ఎవరనే అంశాన్ని దర్శకుడు టచ్ చేయలేదు. రేసు పనిమీదే ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా.. బస్టాప్‌లో ఉన్న ఓ అమ్మాయి చేతి వేళ్ళు అనుకోకుండా హర్షకు తగిలి హృదయంలో ఏదో తెలీని అనుభూతి కలిగి అతనికి పూర్వజన్మ స్ఫురిస్తుంది.
చివరికి ఆమెను పట్టుకుని ఆమె ఇందిర అని, గత జన్మలో యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్)గా హర్ష ఓ నిర్ణయానికి వస్తాడు. ఈ విషయం మిత్రబృందకు తెలియదు. మరోవైపు అలనాటి ఉదయ్‌ఘడ్ కోటను ఇందిర కుటుంబానికి దక్కకుండా చేస్తుంటాడు మేనమామ రణదీప్ (దేవ్‌గిల్). తనకు దక్కనిది మరొకడికి దక్కనీయకుండా చేసే తత్త్వం రణదీప్‌ది.
అలా ఇందిర తనది కావాలంటే హర్షను చంపాలి. ఇలా ఇందిరను దక్కించుకునే సమయంలో ఏదో తెలియని శక్తి రణదీప్‌ను అడ్డుకుంటుంది. వెంటనే రణదీప్ అఘోరాను సంప్రదిస్తే ఇది పూర్వజన్మ వాసన అంటూ 400 ఏళ్ళనాటి చరిత్రను కళ్ళముందుంచుతాడు. (ఇక్కడంతా అరుంథతి సినిమా గుర్తుకువస్తుంది. అందులోనూ అరుంధతిని అనుభవించాలని కామవాంఛతో రగిలిపోయే పశుపతి పాత్రకు రణదీప్ పాత్రకు పోలిక కన్పిస్తుంది).