కెమేరా: వెట్రి, సంగీతం: తమన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ, నిర్మాతలు: జె.భగవాన్, జె. దానయ్య విడుదల 11.09.1009 శుక్రవారం
పాయింట్: తండ్రికి తలకొరివి పెట్టడమే కాదు... చంపినవాడి తలతెగేలా చేయడమే కొడుకు పని.. అనే ఫ్యాక్షన్ ఫార్ములా చిత్రం
తెలుగు సినిమాల్లో కొన్ని ఇంకా రొటీన్ ఫార్ములాలోనే మునిగి తేలుతున్నాయ్ అనడానికి చక్కటి ఉదాహరణే ఈ శంఖం. రణం, లక్ష్యం, శౌర్యంలోని "సున్నా" సెంటిమెంట్‌తో ఈసారి శంఖం అంటూ గోపీచంద్ చేసిన మరో ప్రయత్నం. పక్కా మాస్‌ను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రమిది. వెంకటేష్ నటించిన జయం మనదేరా... చిత్రానికి దాదాపు జెరాక్స్ కాపీ శంఖం. కాస్త మార్పులతో సత్యరాజ్ వంటి నటుడితో చేసిన ప్రయోగం.
రణంలో ఫ్యాక్షనిజంలో నాయకులకోసం అనుచరులు జీవితాలు బలిచేసుకోవద్దన్న పాయింట్ ఉంటే శౌర్యంలోకి వచ్చేసరికి ప్రజలను పీడిస్తున్న ఫ్యాక్షనిస్టును మరో ఫ్యాక్షనిస్టు కొడుకు ఎలా చంపాడన్నది చర్చించాడు. ఇందులో పెద్దగా సందేశాలు, ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఏమీ ఉండవు. ఏదో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు గొడవ.
కత్తులతో కుత్తుకలు తెంచుకుంటే... చూసి ఆనందించే స్థాయిలో ఈనాటి ప్రేక్షకుడు లేడు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు గ్రహించినట్లు లేరు. కథలోనూ ప్రత్యర్థులుగా మారేందుకు ఫ్యాక్షనిస్టులకు బలమైన కారణాలు అసలే కనబడవు. ఏదో ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి కనుక ఒకడు మంచివాడు, మరొకడు చెడ్డవాడు అనేలా చూపాలి కనుక చూపాడు. ఎన్నుకున్న ప్రదేశం కూడా కడప జిల్లాలోని ఎర్రగుంట, ఒంటిమిట్ట ప్రాంతాల ఫ్యాక్షన్ నాయకులు పశుపతి( కోట శ్రీనివాసరావు), శివయ్య (సత్యరాజ్)
కథలోకి వెళితే ఆస్ట్రేలియాలో సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు చందు ( గోపీచంద్). మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగై దానికి న్యాయం చేయాలంటే ఎవర్ని కొట్టాలనే ఆతృతగా ఎదురుచూస్తుంటాడు. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురవుతుంది. తన మామయ్య చంద్రమోహన్ పర్యవేక్షణలో ఉంటాడు. పెళ్లీడుకు వచ్చాడు కనుక తగిన అమ్మాయికోసం వెతుకుతుంటారు.
మరోవైపు అంతే సరదాగా జీవితాన్ని గడిపేస్తూ... కోపం వస్తే విపరీతంగా ఎదుటివారిని కొట్టే రకం మహాలక్ష్మిది( త్రిష). అక్కడే తన బాబాయ్ హోటల్ అయిన ఆంధ్రామిర్చి అనే హోటల్‌లో ఉంటుంది. అనుకోకుండా మహాలక్ష్మిని చూసి చందు లవ్‌లో పడతాడు. మహాలక్ష్మి మాత్రం ఇష్టపడదు. మధ్యమధ్యలో కొన్ని సంఘటనలతో ప్రేమలో పడుతుంది. సరిగ్గా ఆ టైమ్‌లో మహాలక్ష్మి అత్తమ్మ తెలంగాణా శకుంతల వచ్చి తన కొడుకుతో పెళ్లి నిశ్చయమైందని మహాలక్ష్మిని తీసుకుని వెళుతుంది.
అయితే చందు విషయం తెలిసిన శకుంతల, దమ్మున్నవాడివైతే కడపవచ్చి నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లమని రెచ్చగొడుతుంది. దాంతో ఏకంగా కడపలోని ఎర్రగుంటకు వెళ్లడమేకాక నేరుగా మహాలక్ష్మి ఇంటికి వస్తాడు చందు. ఇది చూసిన మహాలక్ష్మి తండ్రి కోట శ్రీనివాసరావు... చందుకు ఓ పని అప్పగిస్తాడు. అది చేస్తే మహాలక్ష్మి నీకు దక్కుతుందంటాడు.. అది ఏమిటి..? చందు దానిని నెరవేర్చాడా...? ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది. ఆతృత ఉంటే థియేటర్‌కు వెళ్లి చూడాలి.
మొదటిభాగమంతా ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది. ఇంటర్వెల్‌కు కాస్త ముందు ఇండియా వస్తుంది. ఆస్ట్రేలియా ఎపిసోడంతో అల్లరిచిల్లరిగా ఉంటుంది. హీరో హీరోయిన్‌ను ఏడిపించడం... వారికి మధ్యలో శ్రీనివాసరెడ్డి అనే ఆర్టిస్టు పోకిరి చేష్టలతో సాగుతుంది. కామెడీ కోసమే శ్రీనివాసరెడ్డిని పెట్టి చేసిన సన్నివేశాలు ఏమాత్రం పండలేదు. గోపీచంద్ సినిమాలో తప్పనిసరిగా ఉండే అలీ ఇందులోనూ ఉన్నాడు. ఈ పాత్ర కాస్త నవ్విస్తుంది.