పాయింట్: మనకోసం బతికే బతుకు బతుకుకాదు.. ఇంకొకరి కోసం చస్తే అదే నిజమైన జీవితం. ఈ పాయింట్‌తో రౌడీ నక్సలైట్, పోలీసుల మధ్య జరిగే కథాగమనం.
ప్రతి మనిషికి డబ్బు అవసరం. కొందరు డబ్బుతోపాటు అధికారం, హోదాల కోసం పరితపిస్తుంటారు. దానికోసం అడ్డదారిలో పయనిస్తుంటారు. అవసరమైతే చాణక్యనీతిని అవలంబించి కన్నతండ్రినైనా హతమారుస్తుంటారు. రౌడీయిజం, హత్యలు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ప్రజల భయంతో ఆడుకుంటారు.
అందుకే.. మహాకని శ్రీశ్రీ తన "మహాప్రస్థానం"లో ఎప్పుడో చెప్పాడు. "పులి చంపిన లేడినెత్తురు ఎగరేసిన ఎర్రటి జెండా.. ప్రచండ.. డండ.. డండ.. అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం.. ప్రజలు వదిలిన బాణం.. అంటూ చెప్పాడు. ఆ మహాప్రస్థానం నుంచే పుట్టిన కథే ఈ బాణం.
ఇక కథలోకి వెళితే.. 1975 రాజాం అనే ఊరిలో కథ ప్రారంభమౌతుంది. చంద్రశేఖర్ పాణిగ్రాహి (షాయాజీషిండే) నక్సలైట్. సమాజంలో చెడుకు వ్యతిరేకంగా పోరాడి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అతని కొడుకు భగత్ పాణిగ్రాహి (నారా రోహిత్). తండ్రి ప్రేమకు దూరమైనా తండ్రి ఇచ్చిన ధైర్యంతో పెరిగి పెద్దవాడవుతాడు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో అన్నివిధాలా కృషిచేస్తుంటాడు. ఇకపోతే... కాలం తెచ్చిన మార్పులతో నక్సల్ ఉద్యమాన్ని వీడి జనసంద్రంలో కలిసిపోతాడు పాణిగ్రాహి.
మరోవైపు.. కమీషన్లతో రౌడీగా చెలామణి అయి ఊరివారిని బెదిరించి డబ్బు సంపాదించిన తండ్రి ఆస్తి, హోదా తనకు దక్కాలని, ఆయన వారసుడిగా ఉండాలని కన్నతండ్రినే చంపేసిన శక్తి పట్నాయక్ (రణదీర్‌గట్టా) ఆ ఊరినే శాసిస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు రైల్వేస్టేషన్‌లో తల్లావఝల సుబ్బలక్ష్మి భగత్‌కు పరిచయమవుతుంది.
కట్నదాహానికి పెళ్లిరోజే ఇంటినుంచి గెంటివేయబడ్డ అభాగిని ఆమె. ఈ విషయం తెలుసుకుని ఆమెకు గార్డియన్‌గా ఉంటానని ఇంటికి తీసుకొస్తాడు భగత్. ఇక తన లక్ష్యాన్ని చేరే సమయం భగత్‌కు ఆసన్నమైంది.
ఇలా భగత్ సివిల్ పరీక్షలు రాసే టైమ్‌కు శక్తిపట్నాయక్ అనుచరుడు సాహుభగత్‌పై దాడిచేస్తాడు. అందులో సాహు చనిపోతాడు. మిగిలిన అనుచరుల కాళ్లుచేతులు విరుగుతాయి. విషయం తెలిసిన శక్తి పట్నాయక్ భగత్‌ను చంపకుండా అటుఇటు గాకుండా చేస్తానని చావుదెబ్బతీస్తాడు.
ఈ విషయంలో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతారు. పైగా భగత్‌ను పట్నాయక్ అరెస్టు చేయిస్తాడు. ఇది తెలుసుకున్న పోలీసు అధికారి భానుచందర్ భగత్‌కు అండగా ఉంటాడు. అలా ఐపీఎస్ చదివి సమాజాన్ని శాసిస్తోన్న శక్తిలాంటి రౌడీలకు గుణపాఠం చెబుతానంటాడు భగత్. అది ఏవిధంగా చేశాడు? అసలు భగత్‌పై సాహు అనే వ్యక్తి ఎందుకు దాడి చేశాడు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా.