సినిమాకు టైటిల్ ప్రధానం. టైటిల్‌ను బట్టే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందులో ఎంత పెద్ద హీరో లేదా గ్లామర్ హీరోయిన్ ఉన్నప్పటికి.. కథకు సరిపడా టైటిల్ ఉంటే చూడ్డానికి, వినడానికి బాగుంటుంది. కొన్ని సినిమాలకు టైటిల్సే అతకవు. అసలు పొంతనే ఉండదు. అలాంటి కోవలోనే సూర్య నటించిన "ఘటికుడు" సినిమాను చెప్పుకోవచ్చు.
తమిళంలో తీసిన "ఆదవన్" చిత్రాన్ని తెలుగులో ఘటికుడుగా అనువదించారు. దీపావళికి ఈ సినిమా విడుదలైంది. ముందునుంచి అత్యంత భారీ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దామని ప్రకటనలు గుప్పించి, సూర్యను హైస్కూల్ చదివే విద్యార్థిగా వాడినందుకు గ్రాఫిక్స్‌కు అధికంగా ఖర్చయిందని ఎన్ని కబుర్లు చెప్పినా.. కథలో పెద్దగా ట్విస్ట్‌లేకపోవడం, సాదాసీదాగా సాగే గమనంతో ఎంతో ఊహించుకుని వచ్చిన ప్రేక్షకులను ఘటికుడు నిరుత్సాహపరుస్తాడనే చెప్పాలి.
ఇక కథలోకి వెళితే.. అశోక్ (సూర్య) కొల్‌కత్తాలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటాడు. అతనిని తండ్రిగా పెంచి పెద్దచేసిన వాడు షిండే. డబ్బుకోసం చంపడాలు, కాల్చడాలు వంటివి వీరి వృత్తి. వీరి గ్రూప్‌లోని వాడు డిస్కో ఆనంద్. వీరంతా కలిసి ఏ పనైనా వెనుకాడక చేస్తుంటారు. అతుల్‌కులకర్ణి (రాహుల్‌దేవ్) వీరికి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం వచ్చిన జడ్జి భతర్‌మురళీని చంపమని ప్రోత్సహిస్తాడు. అందుకు కోట్ల రూపాయలు ఇస్తానంటాడు.
చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వారి అవయవాలను విదేశాలకు చేర్చి కోట్లు సంపాదిస్తున్న ముఠా గురించి ఇన్వస్టిగేషన్ చేయడానికి భరత్ మురళీ వస్తాడు. మొదటిసారి అశోక్ గురితప్పి జడ్జి తప్పించుకుంటాడు. ఈలోగా అతుల్‌కులకర్ణి నుంచి తీవ్ర ఒత్తిడి బెదిరింపులు రావడంతో మరో అవకాశం తీసుకుని జడ్జి ఇంటిలోనే సూర్య మకాం పెట్టేస్తాడు.
అనుక్షణం ఆయన్ను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ప్రతిసారి జడ్జి తప్పించుకుంటాడు. దీంతో అతుల్‌కులకర్ణికి అశోక్‌పై అనుమానం వస్తుంది. అశోక్‌నే చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఎవరు గెలిచారు.? జడ్జి ఏమయ్యాడు? మధ్యలో నయనతార పాత్ర ఏమిటి? అనేది మిగిలిన సినిమా.