గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » మాస్‌ను ఆకట్టుకునే ప్రభాస్ "ఏక్‌ నిరంజన్" (Ek Niranjan cinema Review| Prabhas| Kangana Ranaut| Sonu Sood| Puri Jagannath)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
నటీనటులు: ప్రభాస్, కంగనా రనౌత్, సోనూసూద్, చలపతిరావు, ముకుల్‌దేవ్, మకరన్ దేశ్‌పాండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, వేణుమాధవ్, బ్రహ్మాజీ, తనికెళ్ళ భరణి, సంగీత, పోసాని, పృథ్వీరాజ్, సత్యప్రకాష్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,

సంగీతం: మణిశర్మ,
ఆర్ట్: చిన్నా,
ఫైట్స్: స్టన్ శివ,

నిర్మాత: ఆదిత్యా రామ్,
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.

పాయింట్: చిన్నతనంలో అమ్మానాన్నకు దూరమైన కుర్రాడు పెద్దయ్యాక వారిని ఎలా కలుస్తాడు? అన్న కథాంశంపై చిత్రమంతా నడుస్తుంది.

ఒకే తల్లికి పుట్టిన ఇద్దరన్నదమ్ముల్లో ఒకడు తప్పిపోతే అతను చనిపోయాడని తల్లి అనుకుంటుంది. అయితే బతికే ఉన్నాడనే విషయం ఆ తల్లికి తెలియదు. అక్కడే తిరుగుతున్నా.. చివరికి ఎలా కలుస్తాడు.. అన్నది ఛత్రపతి సినిమా.

రౌడీగ్యాంగ్‌ లీడర్‌ను చంపడానికి వెళ్ళి తనే వారికి చిక్కిపోయి లీడర్ చెల్లెల్లి ప్రేమిస్తాడు హీరో. ఇది "బుజ్జిగాడు" సినిమా కథాంశం. మళ్లీ ప్రభాస్-పూరీ కాంబినేషన్‌లో.. పై రెండు చిత్రాలను కలిపితే "ఏక్‌నిరంజన్" అవుతుంది.

కథ పరంగా చెప్పాలంటే.. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి దూరమైన 'చోటు' (ప్రభాస్) అనాధగా చిదంబరం (మకరన్ దేశ్‌పాండే) దగ్గర పెరుగుతాడు. ఇలా ఎంతోమంది పిల్లలను తల్లిదండ్రుల నుంచి దూరంచేసే చిదంబరం... ఆ పిల్లలచేత భిక్షమెత్తించి ఆ సంపాదనతో సరదాలు చేస్తుంటాడు.

ఓ సందర్భంలో పోలీసులు చిదంబరాన్ని పట్టుకునేందుకు వెంటాడుతుంటే.. అతనిని 'చోటు' పట్టుకుని పోలీసులకు అప్పగిస్తాడు. దాంతో పోలీసులు చోటుకు కొంత సొమ్మును ఇస్తారు. ఇదేదో బాగుందని క్రమేణా పోలీసులు పట్టుకోలేని దొంగలను, రౌడీలను పట్టుకుని డిపార్ట్‌మెంట్ నుంచి కమీషన్ తీసుకునే విధానాన్ని 'చోటు' వృత్తిగా తీసుకుంటాడు.

చోటు ఉండే కాలనీకి గిటార్ పట్టుకుని మ్యూజిక్ టీచర్ సమీరా (కంగనా) వస్తుంది. ఆమె అన్న కైలాష్ (ముకుల్‌దేవ్)ను పోలీసులకు పట్టించే విషయంలో సమీరాకు దగ్గరవుతాడు చోటు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.

సమీరా అన్న కైలాష్ (ముకుల్‌దేవ్) వెనుక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ లీడర్ జానీభాయ్ (సోనూసూద్). రాష్ట్ర మంత్రిని కైలాష్ చంపుతాడు. అతన్ని పట్టుకోమని పోలీసు కమీషనర్ చలపతిరావు చోటుతు బాధ్యత అప్పగిస్తాడు. ఆ క్రమంలో జానీభాయ్‌ను చోటు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది సినిమా.

"ఏక్‌నిరంజన్"లో చోటుగా ప్రభాస్ పాత్రకు న్యాయం చేశాడు. మాస్‌ను బాగా ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించాడు. కానీ డైలాగ్ మాడ్యులేషన్ రొటీన్‌కు భిన్నంగా మార్చే క్రమంలో లాగి.. లాగి.. మాట్లాడినట్లుంది.

ఛత్రపతి తరహాలో మాడ్యులేషన్ ఉంది. సమీరాగా కంగనా తెలుగుకు పరిచయమైన బాలీవుడ్ నటి. ఆమెతో హావభావాలు పలికించడం తక్కువే. క్లోజప్‌లో డ్రగ్గిస్ట్‌గా కన్పిస్తుంది. ఇతర హీరోయిన్లలో ఉండే చురుకుదనం ఆమెలో లోపించింది.

తంత్ర జ్యోతిష్య పండిట్‌గా బ్రహ్మానందం, ఆయన భార్యగా అభినయ శ్రీ, జూ. రేలంగిగా నటించారు. జ్యోతిష్యం చెప్పే సన్నివేశాలు హ్యాస్యాన్ని పండించినా మంత్ర జ్యోతిష్యుడు (అలీ) పాత్రలో పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం అభినయ శ్రీకి అలీ దగ్గరకావడం అనే ట్రాక్ విసుగుపుట్టింది.

సినిమా మొత్తంగా సోనూసూద్, అతని అసిస్టెంట్ బ్రహ్మాజీ, ఆ తర్వాత ప్రభాస్‌పై జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఎంటర్‌టైన్ చేస్తాయి. విలన్‌ను కొత్తగా చూపించే క్రమంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ విలనే అయినా విలన్ మేనరిజం, ప్రవర్తన ఆకట్టుకుంటాయి. భరణి, సంగీత పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి.

మణిశర్మ సంగీతంలో గొప్పగా చెప్పాల్సింది.. "అమ్మాలేదు.. నాన్నలేడు.. అక్కాలేదు.. చెల్లీలేదు.. ఏక్‌నిరంజన్.." అనే టైటిల్‌సాంగ్ ఆకట్టుకుంది. మిగిలిన పాటలు పర్వాలేదు. శ్యామ్ కె నాయుడు కెమెరా పనీతీరు బాగానే ఉంది. మంత్రి సోదరుడిగా పోసాని కృష్ణమురళి పాత్ర బాగానే ఉంది.

మొదటి భాగం ఎంటర్‌టైన్‌గా సాగుతుంది. రెండో భాగంలో స్టోరీ.. హాంకాంగ్‌ వరకు వెళుతుంది. అక్కడ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా ఉన్నా హింసలో మోతాదు మించింది. విశేషమేమిటంటే..? చంపడాన్నికూడా సరదాగా, కసిగా తీసుకున్న విధానంలో హీరో విలన్ల మధ్య జరిగే సంభాషణలు బాగున్నాయి.

తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ సుఖాంతం చేసి చూపిస్తారు. ఇందులో మాత్రం అది ప్రేక్షకుడి ఆలోచనకే వదిలేసి థ్రిల్ కలిగిస్తాడు. మొత్తానికి ఈ చిత్రం మాస్‌ను ఆకట్టుకునే సినిమా. ఓపెనింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి "ఏక్‌నిరంజన్" ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడో? వేచి చూడాల్సిందే..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఏక్ నిరంజన్, సినిమా, రివ్యూ, ప్రభాస్, కంగనా రనౌత్, సోనూసూద్, పూరీ జగన్నాథ్