పాయింట్: భర్త మంచితనాన్ని గుర్తించేది భార్య. అపోహలతో దూరం చేసుకుంటే ఏమవుతుందనేది ఈ చిత్రం.
అనగనగా ఓ రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు వేటకెళ్ళారు.... ఈ కథ తెలియని వారుండరు. తాజాగా శనివారం విడుదలైన 'మా అన్నయ్య బంగారం' అలాంటిదే. తెలిసిన కథే అయినా దాన్ని కొత్తగా చూపించే విధానమే సినిమాగా నేడు చలామణిగా అవుతుంది. జొన్నలగడ్డ శ్రీను చాలా కాలం తర్వాత దర్శకుడిగా చేసిన సినిమా. లేడీస్ సెంటిమెంట్‌తో పడేయాలని చూశారు. మరి ఎంతవరకు పడేస్తోడో అనుమానమే.
కథ: శివాజీ (రాజశేఖర్)కు ఆరుగురుల అన్నదమ్ములు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. దాంతో కుటుంబ భారమంతా అతనిదే. మేనమామ షాయాజి షిండే వారు చిన్నతనంలోనే ఆస్తిని లాక్కొని బయటకు నెట్టేస్తాడు. తన సోదరుల్ని ఒక్కొక్కరిని ఒక్కో రంగంలో నిష్ణాతుల్నిచేసి నిన్ను తలదన్నేట్లుగా నిలబెడతానని శివాజీ శపథం చేస్తాడు. ఐఏఎస్, కలెక్టర్, సంగీతదర్శకులు ఇలా వారిని చేయాలనుకుంటాడు. అయితే రోజూవారి కార్యక్రమాల్లో తల్లి లేని లోటు తెలిసిపోతుంది.
ఇది తెలిసిన పక్కింటి జయప్రకాష్‌రెడ్డి బాబాయిగా వారికి సలహాలు సహాయాలు చేస్తుంటాడు. అర్జంట్‌గా వదినను తెచ్చుకుంటేనే మీకూ అన్నకు మంచిదని ఇంటికి అందమని వారిచేత చెప్పిస్తాడు. అలా శివాజీకి పెండ్లిప్రయత్నాలు చేస్తుండగా, మంజు (కమలినీ ముఖర్జీ) నచ్చుతుంది. ఆమెనే వదినగా ఫిక్స్ చేసేస్తారు. మంజు తన సోదరి ఝాన్సీతోనే ఉంటుంది. వారిదీ సేమ్ ఫ్యామిలీ ట్రబులే. తల్లిదండ్రులులేరు.
అయితే ఝాన్సీ ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళి అక్కడ అందరికీ సపర్యలు చేయలేక చేసినా చివరికి భర్త ఛీత్కారాలు కూడా పొందాక బయటకువచ్చి చెల్లెల్నిపెంచి పెద్దదాన్ని చేస్తుంది. ఈ అనుభవంతో తన చెల్లెలు ఆ బాదరబందీలేని వాడికి చెయ్యాలని రూల్ పెడుతుంది. దీనికి జయప్రకాష్‌రెడ్డి సర్దిచెప్పి శివాజీకీ ఒకే ఒక్క తమ్ముడున్నాడు అని మేనేజ్ చేస్తాడు. చివరికి పెండ్లిజరుగుతుంది. ఆ తర్వాత అసలు విషయం తెలుస్తుంది. దాంతో ఇంట్లోనుంచి మంజు వెళ్ళిపోతుంది.
వదిన అలా వెళ్ళిపోవడం మంచిది కాదని జయప్రకాష్‌రెడ్డి, శివాజీ ఆరుగురి తమ్ముళ్ళతో తాము అడ్డంకిగా ఉండమనీ, అందుకు సాక్ష్యంగా ప్రామిసరీ నోట్ రాసి ఝాన్సీకి ఇస్తారు. తన అన్నతో తలో ఒక మాట చెప్పి ఇంటి నుంచి బయటపడతారు. ఓ సందర్భంలో వారు చెప్పింది అబద్ధం అని తెలిసినా శివాజీ తెలియకుండా నటిస్తాడు.
మరోవైపు శివాజీ మేనమామ షిండే కొడుకు ఫుల్‌గా తాగి కారులో వస్తూ రోడ్డుమీదవారిని గుద్దుకుంటూ, అడ్డొచ్చిన పోలీసు మీదుగా పోనిచ్చి పారిపోతుంటాడు. ఇది చూసిన శివాజీ వాడిని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళతాడు. అదేటైమ్‌లో రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క రాజ్యసభసీటు షిండేకు వస్తుంది. కొడుకు విషయం తెలిసిన అధిష్టానం సీటు మరొకరికి ఇస్తుంది. దీంతో మరింత రెచ్చిపోయి శివాజీ ఫ్యామిలీని చంపేసే ప్లాన్‌ను షిండే వేస్తాడు. రౌడీలు వచ్చి అన్నదమ్ముల్ని ఎటాక్ చేయడంతో అటుగా గుడికి వచ్చిన మంజుకు కాన్పు నొప్పులు వస్తాయి.
వదిన నొప్పులు చూసి శివాజీ తమ్ముళ్ళు కాన్పు సక్రమంగా జరిగేట్టు చూస్తారు. దీంతో మంజుకు కనువిప్పు కలిగి మనసు మార్చుకుని తన మరిదుల్ని ఇంటికి ఆహ్వానిస్తుంది. దాంతో శుభం కార్డ్. ఆ కార్డ్ వేసేటప్పుడు ఒకడు ఐఏఎస్, ఒకడు కలెక్టర్, ఇద్దరు సంగీత దర్శకులు ఇలా వెంటనే ఎదిగిపోతారు. ఇదీ సంగతి.
డా|| రాజశేఖర్ ఇటువంటి సెంటిమెంట్ పాత్రలు ఈజీగానే చేసేస్తాడు. గతంలో చేసిన సెంటిమెంట్ పాత్రల్లాగానే చేశాడు. కాస్త ఏజ్ ఎక్కువైనట్లుగా ఫేస్‌లో స్పష్టంగా కన్పిస్తుంది. కమిలనీ ముఖర్జీ కూడా సేమ్. ఆమె నటించడానికి పెద్దగా లేకపోయినా ఫేస్ బాగా చిక్కినట్లుంది. ఝాన్సీ పాత్ర బాగానే ఉంది. జయప్రకాష్‌రెడ్డి పాత్ర కీలకం. సినిమా మొత్తంగా ఆయన పాత్రలోనే హాస్యం, సెంటిమెంట్ ఉన్నాయి. కొత్తతరహా పాత్రలో నటించాడు. పాజిటివ్‌పాత్ర అది.
షిండే రొటీన్‌గా నమ్మించి మోసంచేసే వాడుగా నటించాడు. సోదరుల పాత్రలు ఏడుగురు ఎందుకు పెట్టారో తెలియదు. ఎక్కువ సంతానాన్ని భరించే అన్న అయితే సెంటిమెంట్ పండుతుందేమోనని అలా పెట్టినట్లుంది మినహా ఆ పాత్రల్లో ప్రత్యేకంగా ఏమీలేవు. లోగడ అమితాబ్‌నటించిన 'సత్తెపే సత్తా' చిత్రం గర్తుకు రాకమానదు. ఇక మిగిలిన పాత్రలు పెద్దగా చెప్పాల్సినవి కావు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవే. బ్రహ్మానందం పాత్రకూడా పెద్దగా నవ్వు తెప్పించదు.
పరుచూరిబ్రదర్స్ రచించడానికి పెద్దగా ఏమీలేవు. బలమైన డైలాగ్‌లు సెంటిమెంట్‌గా ఆకట్టుకునేవి తక్కువే. కొన్ని డైలాగ్‌లు ఇదివరకు విన్నవిగానే అనిపిస్తాయి. రెండు పాటలే కొంచెం వినబడతాయి. మిగిలిన మూడు పాటలు ఏమిటో అర్థంకావు. సంగీతం డామినేట్ చేసింది. మరి ఎస్.ఎ.రాజ్‌కుమార్ ఇటువంటి సంగీతం ఎలా ఇచ్చాడో అర్థంకాదు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీను స్క్రీన్‌ప్లేలో కాస్త శ్రద్ద పెడితే బాగుండేది.
సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయేటట్లుగా ఉంది. కెమెరా పనితనం రొటీన్‌గానే ఉంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఫైటింగ్ మోతాదుకు మించినట్లుగా ఉంటుంది. ఒక్కడే ఎంతోమందిని టకటకా నరికేస్తుంటాడు. చిన్నాచితకా చిత్రాలు తీసే నట్టికుమార్ తొలిసారిగా
ఓ మోస్తరు పెద్ద సినిమా తీశాడు. చిత్రం విడుదలకు ముందు బిజినెస్ అయి టేబుల్ ఫ్రాఫిట్ వచ్చింది. కేవలం రాజశేఖర్ సెంటిమెంట్ సినిమా అనే వ్యాపారం అయింది. మరి మహిళలు ఇంట్లో నుంచి ధియేటర్‌కు వస్తేగానీ సినిమా ఆడదు. లేదంటే కష్టమే.