ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే.
అందుకే వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇంతగా పర్యాటకులకు ఇష్టమైన జలపాతాలతో పాటు ఆద్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
అలా ఆద్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.
కుట్రాలంలోని విశేషాలు కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి. కుర్తాలంలోని శివలింగాన్ని పురాణకాలంలో అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.
కుర్తాలంలోని ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్పసంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. కుర్తాలంలోని కుర్తాల నాదర్‌గా వెలసిన పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు.
|