అప్పుడు పురూరవుడు తపస్సు చేస్తే... శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను కానీ మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచేవారెవరని ప్రశ్నిస్తాడు. వింధ్య పర్వతుడు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా అమర్ కంటక్‌లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!
ఆ కథనలా ఉంచితే... యమునా నదిలో ఏడుసార్లు, సరస్వతిలో మూడుసార్లు, గంగలో ఒకసారి స్నానం చేస్తే పాపాలు పోయి పవిత్రులవుతారుగానీ... నర్మదానదిని చూస్తేనే అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుంది.
ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒకవైపు నుండి మరో వైపుకు వెళ్ళాలి. భారీకాయాలున్నవారు కూడా ముందుగా తలదూర్చి మెల్లగా తమ శరీరాన్ని ఎలాగోలా అవతలిపక్కకి తీసుకెళ్తుంటారు. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చునేమో..?!
నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్యాశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా అనబడే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలనూ వీక్షించవచ్చు.
అమర్ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే "కపిల ధార" అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తునుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.
ఎలా వెళ్లాలంటే... విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్‌పూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో ప్యాసింజర్ రైల్లో పిండ్రా వరకు వెళ్లి అక్కడినుంచి అద్దె వాహనాల్లో అమర్ కంటక్ వెళ్లవచ్చు. లేదా బిలాస్‌పూర్ నుంచే నేరుగా ట్యాక్సీలలో 120 కిలోమీటర్ల దూరంలోని అమర్ కంటక్ వెళ్ళవచ్చు. |