చిరపుంజి వెళితే అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు రిసార్టులు అందుబాటులో ఉంటాయి. ఇక ట్రెక్కింగ్‌కు గనుక సిద్ధపడినట్లయితే సహజసిద్ధంగా ఏర్పడిన వంతెనలను సైతం చూడవచ్చు. ఈ వంతెనలు ఒక్కోటి 200 సంవత్సరాల పురాతనమైనవి కాగా, ఇవి రబ్బరు చెట్లతో సహజసిద్ధంగా ఏర్పడినట్లు చెబుతుంటారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని మాలినోంగ్ గ్రామం కూడా మేఘాలయలో చూడదగ్గది. ఇది ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. మేఘాలయ టూరిజం డెవలప్‌మెంట్ ఫోరం ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చాలా శ్రమించింది. ఆ శ్రమ ఫలితమా అన్నట్లుగా నిజంగానే మాలినోంగ్ చాలా పరిశ్రుభంగా ఉంటుంది.
రంగురంగులతో పూచే పూలు, చెట్ల కొమ్మల మీద విశ్రాంతి గృహాలు కలిగిన మాలినోంగ్... మేఘాలయలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఇక్కడి ప్రజలు కూడా ఎంతో మన్ననగా వ్యవహరిస్తుంటారు... అయితే తమను ఫొటోలు తీయటం మాత్రం వారికి అస్సలు ఇష్టం ఉండదు.
షిల్లాంగ్ బారా బజార్‌లో స్త్రీల కోసం ప్రత్యేకంగా దుస్తులు దొరుకుతాయి. వీటిని లేసులు, పూసలతో అలంకరించుకుని అక్కడి ఖాసీ మహిళలు అత్యద్భుతంగా ధరిస్తారు. సరసమైన ధరల్లో అంటే.. 200 రూపాయల నుంచి, కొన్ని వేల రూపాయల విలువ చేసేవి కూడా ఇక్కడ దొరుకుతాయి.
డాన్, బోస్కో మ్యూజియం, బారా బజార్, షిల్లాంగ్ శిఖరం, ఎలిఫెంట్ ఫాల్స్, సహజ వంతనెలు..... తదితరాలు మేఘాలయాలో ఇంకా చూడదగ్గ మరికొన్ని పర్యాటక ప్రాంతాలు. ఆహారం విషయానికి వస్తే.. ఇక్కడ చైనీస్, టిబెటన్, భారతీయ వంటకాలు లభిస్తాయి. ఇక్కడి పోలీస్ బజార్ ప్రాంతంలో చాలా హోటళ్ళున్నాయి. ఈ హోటళ్లన్నింటిలోనూ లభించే మొమోలను అక్కడివారు ఇష్టంగా తింటుంటారు.
ఎలా వెళ్లాలంటే... గౌహతి వరకూ విమానంలో వెళ్లి.. అక్కడి నుంచి రహదారి మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుంది. 13 వందల రూపాయల అద్దెతో రోడ్డు ప్రయాణం కోసం ట్యాక్సీలు దొరుకుతాయి. షేరింగ్ పద్ధతిలో అయితే మూడు వందలకు ఇటూ, ఇటూ అవుతుందంతే. ఇక షిల్లాంగ్‌లో తిరిగేందుకు కూడా ఈ షేరింగ్ ట్యాక్సీలే అనుకూలంగా ఉంటాయి.