ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పర్వత ప్రాంతాలు » ఇండియన్ నయాగరా.. ఔషధీ జలపాతం "హొగెనక్కల్" (Mountains | Hogenakkal Waterfalls | Tamilnadu | Dharmapuri | Karnataka | Kannada | Kaveri River |)
Bookmark and Share Feedback Print
 
Waterfall
FILE
కావేరీ నదిమీద ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హొగెనక్కల్ జలపాతం భారతీయ నయాగరాగా పేరుగాంచింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురికి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం, వనమూలికల ఔషధ విలువలతో అలరారుతూ సందర్శకులకు ఓ వైపు ఆహ్లాదాన్ని, మరోవైపు ఆరోగ్యాన్ని అందిస్తోంది. దక్షిణ ఆసియాలోనే అతి ప్రాచీన కార్బొనెట్ శిలలు ఉన్న ఈ జలపాతం బోటు షికారుకు కూడా పెట్టింది పేరు.

కన్నడ భాషలో "హొగె" అంటే 'పొగ' అని అర్థం. "క్కల్" అంటే 'రాయి' అని అర్థం. అందుకే హొగెనక్కల్ అంటే పొగలు చిమ్మే రాయి అని అర్థం వస్తుంది. ఇక్కడి జలపాతం నీరు రాళ్లపై పడినప్పుడు లేచే నీటితుంపర్లు పొగలాగా ఉంటుంది. కాబట్టి... పొగతో నిండిన కొండలాగా ఉంటుంది కాబట్టి ఈ జలపాతాన్ని "హొగెనక్కల్" అని పిలుస్తారు. ఇక తమిళ ప్రజలయితే "మరికొట్టాయం" అని ముద్దుగా పిలుచుకుంటారు.

కర్నాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోగల బ్రహ్మగిరి కొండల్లో తలకావేరి వద్ద పుట్టిన కావేరీనది.. తూర్పుదిక్కుగా దిగువకు వేగంగా ప్రవహిస్తుంటుంది. కొండవాలులో ప్రవాహవేగం పెరిగి పిల్లకాలవలను కలుపుకుంటూ ముందుకు సాగుతూ, హొగెనక్కల్ వద్ద ఎన్నో జలపాతాలుగా చీలి పర్వతాల గుండా క్రిందికి ప్రవహిస్తుంటుంది. హొగెనక్కల్ చేరేసరికి కావేరీ నది చాలా విశాలంగా తయారై కొండచరియల మీద పడుతూ చాలా జలపాతాల్ని తయారుచేస్తుంది.
పుట్టిలో సరదాగా...!
గుండ్రంగా 2.24 మీటర్ల వ్యాసార్థంతో, వెదురుతో అల్లిన ఈ తెప్పల్లోకి నీరు ప్రవేశించకుండా కింది భాగం తోలుతోగానీ, ప్లాస్టిక్‌తోగానీ తయారుచేస్తారు. తెడ్డుసాయంతో వీటిని ముందుకు నడుపుతారు. ఈ తెప్పల్లో ఒకేసారి 8 మంది ప్రయాణించవచ్చు...


హొగెనక్కల్ జలపాతంలోని నీరు 20 మీటర్ల ఎత్తునుంచి పెద్ద శబ్దంతో ధ్వనిచేస్తూ క్రిందకు పరుగుతీస్తుంటుంది. ఈ ప్రవాహ ఉధృతికి నీరు తెల్లటి పొగలాగా లేచి ప్రవహిస్తుంటుంది కాబట్టే దానికి హొగెనక్కల్ అనే పేరు వచ్చింది. ఇక్కడ్నించీ దక్షిణంగా ప్రవహించే ఈ జలపాతం నీరు, జలపాతం దాటిన వెంటనే దక్షిణంగా ప్రవహించి మెట్టూరు ఆనకట్ట ద్వారా ఏర్పడిన స్టాన్లీ జలాశయంలో ప్రవేశిస్తాయి.

ఈ జలపాతం పరిసరాలలో ప్రత్యేకంగా నిర్మించిన స్నానఘట్టాలున్నాయి. కొన్ని మైళ్ళు విస్తరించిన నదీజలాలు అడవుల గుండా ప్రయాణించి ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లను తాకుతూ ప్రవహిస్తాయి. అందువలన ఈ నీటిలో స్నానం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు. ఈ జలపాతం చుట్టూ ఉండే కొండలు కూడా అతి సుందరంగా కనిపిస్తాయి.

హొగెనక్కల్‌కు చేరే కావేరీ నది అడవులగుండా ప్రవహించి, అక్కడి వనమూలికల ప్రభావంతో నిండి ఔషధీ జలాలుగా మారి జలపాతంగా ప్రవహిస్తుంది. హొగెనక్కల్‌కు వెళ్లే దారిలో టెర్రకొట్ట గ్రామంలోని అందమైన తోటలను దర్శించవచ్చు. పట్టుపురుగుల ఆహారమైన మల్బరీ ఆకులతో నిండిన పచ్చటి తోటలతో ఈ పరిసరాలు వనదేవతల్ని సైతం మరిపించేలా ఉంటాయి. గ్రామ సరిహద్దుల్లో యుద్ధవీరుల్ని తలపించేలా ఉండే ఎర్రమట్టితో చేసిన గ్రామదేవతల (అయ్యనార్లు) ఎత్తైన విగ్రహాలు స్వాగతమిస్తాయి.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.