ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > పుణ్య క్షేత్రాలు > కోరిన వరాలిచ్చే "కోదండ రామయ్య"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోరిన వరాలిచ్చే "కోదండ రామయ్య"
FILE
తండ్రి ఆజ్ఞను జవదాటని పుత్రుడిగా, ఆదర్శమైన భర్తగా, ప్రజాభీష్టానికి తలవంచే పాలకుడిగా... సర్వ మానవాళికి శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు. భార్యపై వల్లమాలిన ప్రేమానురాగాలను ప్రదర్శించే ఈయనను సీతారాముడిగా కొలిచే ప్రజలు, భారతదేశంలో అడుగడుగునా ఆలయాలను నిర్మించి భక్తిప్రపత్తులతో నిత్యం పూజిస్తున్నారు.

ఉత్తర భారతదేశంలోకన్నా, దక్షిణ భారతదేశంలోనే శ్రీరాముడికి ఆలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో రామాలయం లేని గ్రామాలు చాలా అరుదుగా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి ఆలయాలలో... శ్రీకాకుళం నడిబొడ్డున కొలువైన కోదండ రామస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ప్రాచీన చరిత్ర కలదు.

అయితే... ఈ ఆలయాన్ని ఎవరు, ఎప్పుడు నిర్మించారన్న ఖచ్చితమైన ఆధారాలు లేవుగానీ... ఈ ప్రాంతం ముస్లిం ప్రభువుల పాలనలో ఉన్నప్పుడే నిర్మించారన్నదానికి దాఖలాలు ఉన్నాయి. ఈ ఆలయానికి అప్పటి జమీందారులు, సంస్థానాధీశులు కోట్లాది రూపాయల ఆస్తులను సమకూర్చారు. బ్రిటీషువారి హయాంలో అంటే సుమారు 200 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. కాగా.. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది.

ఆలయం విశిష్టతలు చూస్తే... ఈ ఆలయంలో ఓ వైపు గోదాదేవి, మరోవైపు శ్రీ మహాలక్ష్మి ఆలయాలు ఉన్నాయి. కోదండరాముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు గోదాదేవి, శ్రీమహాలక్ష్మిలను కూడా సందర్శించుకుంటుంటారు. కోదండరాముడి బంటు హనుమంతుడి ఆలయం కూడా ప్రధాన ఆలయం పక్కనే ఉంటుంది. స్వామివారిని దర్శించేందుకు వచ్చే భక్తులు ముందుగా హనుమయ్యను దర్శించి, అనంతరం ఆలయం లోపలకి వెళ్తుంటారు.

హనుమయ్య ఆలయం ప్రక్కనే రామకోటి స్థూపం ఉంటుంది. హనుమంతుడే స్వయంగా రామకోటి రాసి ఈ స్థూపం కిందన ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఇక కోదండ రామాలయంలో ప్రాచీన కాలానికి చెందిన ఎన్నో అరుదైన శిల్పాలు ఉన్నాయి. సుమారు 6 లేక 7 వందల సంవత్సరాల క్రితం నాటి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల విగ్రహాల్లో ఇప్పటికీ జీవకళ ఉట్టిపడేలా ఉంటాయి.

ఈ కోదండ రామాలయంలో ఒరిస్సాలోని కోణార్క్ ఆలయాల శిల్పశైలి మనకు కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎన్నో వేల జంటల వివాహాలకు ఈ ఆలయం వేదికగా నిలుస్తోంది. ఈ ఆలయంలో వివాహం చేసుకున్నట్లయితే, ఆ జంట చిరకాలం సుఖసంతోషాలతో ఉంటారన్నది ప్రజల విశ్వాసం.

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో శ్రీరామనవమినాడు, ధనుర్మాసంలోనూ, వైకుంఠ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తారు. వసతి, రవాణా విషయాలకు వస్తే... శ్రీకాకుళం నుంచి పాలకొండ రోడ్డులో వెళ్లినట్లయితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఒక సత్రం కూడా కలదు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సంతాన దేవత చెర్లోపల్లి "రెడ్డెమ్మ తల్లి"
పాలరాతి కావ్యం "స్వామి నారాయణ మందిరం"
త్రికూట కొండలపై కొలువైన "వైష్ణోదేవి"
స్వర్ణదేవాలయం : అమృత్‌సర్
బోయకొండపై కొలువైన గంగమ్మ తల్లి
జన్మసార్థక నిలయాలు... ద్వాదశ జ్యోతిర్లింగాలు