ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » పుణ్య క్షేత్రాలు » మరపురాని దృశ్య కావ్యం "అంగ్‌కోర్ వాట్" సందర్శనం...! (Religious | Angkor Wat | Cambodia | Hindu | Siem Reap | Khmer | Second Suryavarman | King | Ramayana | MahaBharat)
మరపురాని దృశ్య కావ్యం "అంగ్‌కోర్ వాట్" సందర్శనం...!
FILE
భారతీయ సంస్కృతికి చిహ్నంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా వెలుగొందుతోంది కంబోడియాలోని "అంగ్‌కోర్ వాట్ దేవాలయం". ప్రపంచ చారిత్రక కట్టడాలలో ఒకటిగా పేరు సంపాదించిన ఈ ఆలయం.. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడి, హిందూ సంస్కృతీ సౌరభాలను వెదజల్లుతోంది. భారతీయ పురాణేతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందర్నీ ఆకర్షిస్తోంది.
కంబోడియా జాతీయ పతాకంలో కూడా చోటు దక్కించుకున్న అంగ్‌కోర్ వాట్.. ప్రపంచ ఆధునిక నాగరికతల్లో ఒకటిగా చెప్పబడే "ఖ్మేర్" సామ్రాజ్య కాలంలో నిర్మించినట్లు చెబుతుంటారు. ఈ దేవాలయ గోడలపై విష్ణుమూర్తి మొదలగు హిందూ దేవుళ్లతోపాటు.. రామాయణ, మహాభారత కాలంనాటి అద్భుతమైన ఘట్టాలు శిలా రూపాల్లో అత్యద్భుతంగా చెక్కబడి మనకు దర్శనమిస్తాయి.
కంబోడియాలోని "సీమ్ రీప్" అనే పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది "అంగ్‌కోర్ వాట్" దేవాలయం. ఖ్మేర్ సామ్రాజ్యకాలంలో ఈ ఆలయానికి అంకురార్పణ జరిగినట్లు తెలుస్తోంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో అంగ్‌కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పలు చారిత్రక ఆధారాలు రుజువు చేస్తున్నాయి.
సూర్యోదయం వేళలో...!
సూర్యోదయం వేళలో ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. గోపుర ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే.. గోపురం చాటు నుంచీ దోబూచులాడుతూ కిందకు జాలువారే ఉదయభానుడి లేలేత కిరణాలు ఓ అద్భుతమైన సుందర దృశ్యాన్ని కళ్లముందు నిలుపుతాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు రెండుకళ్లూ....
"టోనెల్ సాప్" సరస్సు తీరాన, 200 చదరపు కిలోమీటర్ల సువిశాలమైన ప్రదేశంలో.. "కులేన్" పర్వత శ్రేణుల పాదాలవద్ద అంగ్‌కోర్ వాట్ దేవాలయం నిర్మించబడింది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద హిందూ దేవాలయంగానే కాకుండా.. అతిపెద్ద మహావిష్ణుదేవాలయంగా కూడా పేరు సంపాదించింది.
అంగ్‌కోర్ వాట్.. చాలా దేవాలయాల సముదాయం. పురాతన కాలంలోనే ఖచ్చితమైన కొలతలు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ పనివిధానంతో ఈ ఆలయాన్ని రూపొందించటం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హిందూ సాంప్రదాయ అస్థిత్వం ఉండే భారత ఉపఖండంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదని చెబితే అతిశయోక్తి కాదు. ఈ దేవాలయాన్ని నిర్మించేందుకు సుమారు 30 సంవత్సరాల కాలం పట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దేవాలయ నిర్మాణం.. అచ్చం తమిళనాడులోని దేవాలయాలను పోలి ఉండటం విశేషం. తమిళ చోళ రాజుల కాలంనాటి నిర్మాణ పద్ధతులు అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో గోచరిస్తూ ఉంటాయి. అదీ.. ఖ్మేర్ సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఇతర దేవాలయాలకు కాస్త భిన్నంగా.. అంగ్‌కోర్ వాట్ ఆలయం పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది.
ఖ్మేర్ పరిపాలనలో నీటిని నిల్వ ఉంచుకుని.. కరువు కాటకాలప్పుడు వాడుకునే టెక్నాలజీని అప్పట్లోనే అమలు చేశారు. కాబట్టే.. ఆ సామ్రాజ్యంలో కరువు ఛాయలు ఉండేవికావట. వీరు నీటిని నిల్వ ఉంచేందుకు వాటిన టెక్నాలజీలో.. నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహించేదట.. ఇదే టెక్నాలజీని అంగ్‌కోర్ వాట్ ఆలయ నిర్మాణంలో వాడారు.
ఈ టెక్నాలజీ ఎలా సాధ్యమయ్యిందనే విషయం నేటి ఆధునిక సాంకేతిన నిపుణులకు సైతం అంతుబట్టకుండా ఉంది. 5 మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు విశాలంతో నిర్మితమైన "బారే" (రిజర్వాయర్లు)లు ఆనాటి అద్భుతమైన ఇంజనీరింగ్ పనితీరుకు అద్దంపట్టేలా దర్శనమిస్తున్నాయి.
అదలా ఉంచితే.. ఈ ఆలయ సందర్శనం జీవితంలో ఓ మరపురాని అనుభూతిగా మిగులుతుందటే ఆశ్చర్యపడాల్సింది లేదు. పచ్చగా పరచుకున్న పరిసరాలలో మమేకమవుతూ... మెకాంగ్ నదీమార్గం గుండా పడవలో ప్రయాణిస్తూ చేసే ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకమవుతుంది. వియత్నాంలోని చావూ డాక్ నుంచి బయల్దేరి కంబోడియా రాజధాని "నోమ్ పెన్" మీదుగా సీమ్ రీప్ చేరుకోవచ్చు.