సౌమ్యనాథుడి ఆలయ కట్టడం వెనుక 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర దాగి ఉండటం అతిశయోక్తి కాదు. స్వామివారి గర్భాలయం వైకుంఠ ద్వారంతో నారద మునీంద్రులవారు ప్రతిష్టించినట్లు ప్రతీతి. స్వామివారి మూల విరాట్టు ఆరడుగుల ఎత్తుతో చాలా సౌమ్యంగా, అభయ ముద్రాలంకితులై దర్శనమిస్తుంటారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహ సౌందర్యం వర్ణించేందుకు మాటలు సరిపోవు.
సౌమ్యనాథుడిని చొక్కానాథుడని కూడా భక్తులు కొలుస్తుంటారు. సౌమ్యనాథుడు, చొక్కానాథుడు అనే రెండు పిలుపులకూ అర్థం సౌందర్యవంతుడనే. సౌమ్యనాథుడు అంటే సౌమ్యకే (లక్ష్మీదేవి) నాథుడనీ, ప్రశాంత స్వరూపుడనీ అర్థం. శ్రీవారి వక్ష స్థలంపై శ్రీ మహాలక్ష్మి మూర్తిరూపాలు చెక్కబడి ఉంటాయి. శిలామూర్తిపై యజ్ఞోపవీతాలు, కంఠాభరణాలు ఉంటాయి. స్వామిని సేవించిన ఆంజనేయుడిని కుడివైపున ప్రతిష్టించారు.
ఆలయ నిర్మాణంలో ఎర్ర రాతిని వినియోగించటమేగాక... ఆలయ కుడ్యాలపై వివిధ రాజుల సంకేతాలుగా మత్స్య, సింహ, అర్థచంద్రాకారపు చిహ్నాలను కట్టించారు. ఆలయ గోడలపై తమిళ శాసనాలు అధికంగా ఉండగా, తెలుగు శాసనాలు కొన్ని మాత్రమే అగుపిస్తాయి. అలాగే ఆలయంలోని నిలువు బండలపై 11వ శతాబ్దం నుంచి విజయనగర పరిపాలనదాకా జరిగిన ముఖ్యమైన అనేక వివరాలతో కూడిన 54 శాసనాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.
సౌమ్యనాథుడిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసిన వెంటనే.. స్వామివారు దర్శనమివ్వటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అంతేగాకుండా, సంతాన సాఫల్యం కోసం తపించే దంపతులకు సంతాన ప్రాప్తిని కలిగించిన కీర్తిని కూడా స్వామివారు మూటగట్టుకున్నారు. వివిధ కోర్కెలను తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. అయితే, కోర్కెలు తీరిన వెంటనే 7 రోజులలోపు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారి మొక్కును తీర్చుకోవాల్సి ఉంటుంది.
ప్రతి నెలా శ్రావణ నక్షత్రం రోజున స్వామివారికి ఊంజల్ సేవా కార్యక్రమాన్ని భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించడం విశేషం. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హరికథ, అన్నమయ్య కీర్తనలను ఆలపించి భక్తులను అలరిస్తున్నారు. ప్రతి ఏటా శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు జూన్- జూలై గ్రీష్మరుతువు మిథున మాసంలో పదిరోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఎలా వెళ్లాలంటే.. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అతి సులభంగా సౌమ్యనాథున్ని దర్శించుకోవచ్చు. నందలూరు నుండే రాష్ట్ర రహదారితో పాటు చెన్నై-ముంబై మార్గంలో రైలు సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. తిరుమలకు వెళ్ళే భక్తులు కూడా సౌమ్యనాథున్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులను అందుకుంటుంటారు.
ఇక చివరిగా... ఎంతో ఘన చరిత్ర కలిగిన సౌమ్యనాథ ఆలయ అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఉంది. దక్షిణ గాలిగోపురం పూర్తిగా దెబ్బతినడంతో మొండిగోడలు నేడు దర్శనమిస్తున్నాయి. అలాగే ఆలయ చరిత్ర ప్రాధాన్యతను తెలపాల్సిన పురావస్తు, దేవాదాయ శాఖలు నిర్లక్ష్యవైఖరిని ప్రదర్శిస్తున్నాయి. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలోని పూల మొక్కలు, తోటలు అభివృద్ధిని అధికారులు పూర్తిగా విస్మరించారు. ఇప్పటికైనా పురావస్తు, దేవాదాయ శాఖలు కళ్లుతెరచి ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.