కొలిచినవారి కొంగు బంగారం "కొల్లేటికోట పెద్దింట్లమ్మ"
FILE
తొమ్మిది అడుగుల ఎత్తుతో, విశాల నేత్రాలతో, వీరాసన భంగిమలో కొల్లేటికోటలో కొలువైయున్న "పెద్దింట్లమ్మ" కొలిచినవారి కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. కొల్లేరు లంక గ్రామాల ప్రజల ఆరాధ్య దైవమైన పెద్దింట్లమ్మను దర్శించుకునేందుకు ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రాంతలనుంచి వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు.
కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన ఒక గ్రామమే "కొల్లేటికోట". కొల్లేరు సరస్సు మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న కొల్లేటి కోట గ్రామంతోపాటు లక్ష్మీపురం, గోకర్ణేశ్వరపురం, శృంగవరప్పాడు, గుమ్ముల్లపాటు, పందిరిపల్లిగూడెం అనే ఐదు కుగ్రామాలన్నీ కూడా కొల్లేరు దీవి అంచున ఉన్నాయి. ఈ కొల్లేటి కోట గ్రామంలోనే శ్రీ పెద్దింట్లమ్మగా పిలవబడే శ్రీ జలదుర్గా అమ్మవారి ఆలయం కలదు.
స్థానికుల కథనం ప్రకారం కొల్లేటికోట చరిత్రను చూస్తే.. ఈ ప్రాంతంలోగల ప్రాచీన దుర్గాన్ని లాంగుల్య గజపతి కట్టించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఓ మట్టిదిబ్బ తప్పిస్తే కోట అవశేషాలేవీ కనిపించవు. ఇక్కడికి దగ్గర్లోని జలదుర్గాలయం చూడదగ్గది. కొల్లేటికోట గ్రామాన్ని 15వ శతాబ్దం చివరలో ఒరిస్సాను ఏలిన అంబదేవరాయ జయించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
కొల్లేటికోట దుర్గాన్ని జయించిన అనంతరం అంబదేవరాయ జలదుర్గాలయంలో జలదుర్గకు బదులుగా పెద్దింట్లమ్మ లేదా మాతంగిదేవి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు స్థానికుల కథనం. గజపతులపై దండెత్తి వచ్చిన మహమ్మదీయ సుల్తానులు లేదా విజయనగర రాజులు కొల్లేటి ఒడ్డున చిగురుకోటవద్ద నిలిచారనీ.. అయితే గజపతుల సైన్యాన్ని చేరుకునే మార్గం కానరాకపోవటంతో ఉప్పుటేరు అనే కాలువను తవ్వి, సరస్సు జలాలను సముద్రంలోకి మళ్లించారని తెలుస్తోంది.
నీటిమట్టం తగ్గిన తరువాత గజపతులపై దాడిచేసి కొల్లేటి కోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. అదలా ఉంటే.. గజపతులపై జరిపిన ఈ దాడి సఫలం అయ్యేందుకు మహమ్మదీయ లేదా విజయనగర సైన్యాధ్యక్షుడు కొల్లేటి ఒడ్డున తన సొంత కూతురిని బలి ఇచ్చాడనీ.. అందుకే ఇప్పటికీ ఆ ఒడ్డుకు పేరంటాళ్ల కనుమ అనే పేరు నిలిచిపోయిందని స్థానికుల కథనం.