మధ్య ప్రదేశ్‌లోని పులుల సంరక్షణా కేంద్రాల్లో పెంచ్ ఒకటి. పెంచ్ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్‌గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పూరా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్ పార్క్ ఉంది.
పెంచ్ జాతీయ పార్కులో అనేక కాల్వలు, నల్లాలు ప్రవహించటం ద్వారా పచ్చదనంతో అలరారుతుంది. ఈ పార్క్‌లో అతిఎత్తైన ప్రాంతం కాలపహార్. ఇది సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంది. పెంచ్ నది ఈ పార్క్ గుండా ప్రవహిస్తుంది. తద్వారా పులులతో పాటుగా ఇతర జంతువులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. పార్క్‌లో ఐదు చోట్ల నిరంతరం జలాలను కురిపించే జలపాతాలు ఉన్నాయి.
పెంచ్ పార్క్‌ను పులుల సంరక్షణా కేంద్రంగా 1977లో ప్రకటించారు. ఈ పార్క్ వైశాల్యం 449.39 చదరపు కి.మీ. 1983లో ఈ పార్క్‌ను జాతీయం చేశారు. దేశంలో 19వ పులుల సంరక్షణా కేంద్రం పెంచ్. పెంచ్ నదిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1977-1988 సంవత్సరాల మధ్య నిర్మించారు.
పెంచ్ పార్క్‌లో 1200 రకాల వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. దేశంలో అత్యధికంగా జంతువులు నివశిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రం పెంచ్. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌లో 90.3 జంతువులు నివశిస్తున్నాయి.
|