కాకపోతే దారి ఎగుడు దిగుడుగా అస్తవ్యస్తంగా ఉంటుంది. లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితిలో ప్రయాణం సాగుతుంది. కావేరి నది బి.ఆర్.కొండలకు ఆగ్నేయం వైపున గల కొల్లేగల్ వద్ద ఒక క్లిష్టమైన మలుపు తిరిగి ఉత్తరం వైపునకు ప్రవహిస్తుంటుంది
బి.ఆర్.హిల్స్ వన్యప్రాణి అభయారణ్యం అనేక అడవి జంతువులకు నిలయంగా ఉంది. విభిన్న రకాల వృక్షజాతులు, జంతుజలాలు ఇక్కడ నివాసమేర్పరచుకున్నాయి. లేళ్ళు, దుప్పులు, పాములు, ఎలుగుబంట్లు, చిరుత పులులు, ఏనుగులు, పులులు, రకరకాల పక్షులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. తేనె తుట్టెలతో కూడిన చెట్లు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. చీకటి పడిందంటే చాలు, రాత్రి సంచార జీవుల సందడి మొదలవుతుంది. రాత్రి పూట ఒక అడవి ఎలా నిద్రపోతుందో స్పష్టంగా తెలుస్తుంది.
ఇక్కడి అభయారణ్యంలో టేకు,దేవదారు తదితర్ వృక్షాలు ఆకాశానికి ఎగబాకినట్లు ఉంటాయి.సుమారు 2000 సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న చెంపక్ చెట్లు ఈ అడవిలో ఉన్నట్లు చెబుతారు."సోలిగస్"గా పిలిచే గిరిజన తెగ ప్రజలు ఈ అడవి వృక్షాన్ని పవిత్రంగా భావించి పూజిస్తారు.
బి.ఆర్.కొండలు అభయారణ్యాన్ని సందర్శించిన వారు అక్కడి "రంగనాథస్వామి ఆలయాన్ని" విధిగా దర్శిస్తారు. ఎత్తైన ఈ పరిసరాల నుండి కనిపించే కొండశ్రేణుల దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. జీవ వైవిధ్యంతో కూడిన బి.ఆర్.కొండలు ప్రశాంతమైన ప్రకృతి గొప్పదనాన్ని పర్యాటకులకు బోధిస్తాయి. |