ఆ తరువాత దారిలో కనిపించే యానాదుల ఆరాధ్య స్థలం "చెంచమ్మ పేట", దానికి కుడివైపున "కరవు కోన", ఎడమవైపున "మాలోడి పేట" ముందుకు వెళితే "తుంబుర తీర్థం" వైపుగా ప్రయాణం సాగుతుంది. మూడువేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు గీసిన పెద్దపులి చిత్రం ఈ దారిలోనే కనిపిస్తుంది. అలాగే బూచోళ్ళపేట దగ్గర ఓ రాతి గోడపై గీసిన పురాతన అడవి చిత్రకారుల సహజ వర్ణ చిత్రాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. అందులోని ఏనుగు సవారీ, వేట, కత్తీ డాలు, పిట్టలు, నృత్యాలు గత కాలాన్ని మన కళ్లముందు సాక్షాత్కరిస్తాయి.
అలా వెళ్ళగా వెళ్ళగా... ప్రముఖ కవయిత్రి, శ్రీనివాసుని పరమ భక్తురాలు తరిగొండ వెంగమాంబ తపస్సు చేసిన తరిగొండమ్మ గవి వస్తుంది. ఇది చాలా పెద్దది. ఇక్కడ ప్రతిఏటా మాఘశుద్ధ పౌర్ణమికి ఉత్సవాలు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో యాత్రికులు కూడా వస్తుంటారు. ఇదే దారిలో నారద మంటపం, దీన్ని దాటుకుని వెళ్తే తుంబుర తీర్థానికి చేరుకుంటాం.
కొన్ని లక్షల సంవత్సరాల భౌగోళిక పరిణామక్రమంలో రెండుగా చీలిన శిఖరమే తుంబుర తీర్థ శిఖరం. ఆ చీలిక పొడవునా నీటికుండాలు, దొనలు, మడుగులు ఏర్పడ్డాయి. వీటి అంచున ఎంతో జాగ్రత్తగా నడుస్తూ ముందుకెళితే తుంబుర తీర్థ ప్రవాహం చల్లగా పలుకరిస్తుంది.
ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నమ్మకం సంగతలా ఉంచితే అనేకమైన మూలికలను స్పర్శిస్తూ, స్వచ్ఛమైన గాలిని ఒరుసుకుంటూ వచ్చే ఆ నీటిలో స్నానం చేస్తే మనసుకు, శరీరానికి కూడా ఒక అనిర్వచనీయమైన ఆనందం కలగడం మాత్రం వాస్తవం.
ఆపై కొండవాలు మీద నుంచి ప్రయాణిస్తూ దిగుడుబావి లాంటి "రామకృష్ణ తీర్థం" చేరుకుంటాం. ప్రతి ఏటా ముక్కోటికి ఇక్కడ జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు హాజరవుతుంటారు. ఆ తరువాత అలాగే ముందుకెళ్తే మలయాళస్వామి తపస్సు చేసిన "సనకసనంద తీర్థం" దర్శించి, పాపనాశనం డ్యామ్ మీదుగా శ్రీనివాసుడి ఇల వైకుంఠం తిరుమల దిశగా సాగిపోతుంది శేషాచలం ప్రయాణం...!! |