ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » అటవీ అందాలు » నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో....! (Tourism | wild life | kodaikenal | madhurai | tamilnadu | palani | dindigal | season | of season | kurinji flower)
కొడైకెనాల్ పట్టణానికి చివర్లో ఉండే "పంపార్ జలపాతం" అందం వర్ణణాతీతం. ఎత్తుపల్లాలతో ఉన్న రాతినేల మీద ప్రవహిస్తూ ఉండే సన్నటి వాగు ఇది. విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలను.. ఓ కొండ అంచున నిలబడి చూసే అవకాశాన్నిచ్చే "గ్రీన్ వ్యాలీ" మరొకటి.
అలాగే స్థానికులు "దయ్యాల గుహ" అని ప్రేమగా పిలుచుకునే "గుణ గుహ".. ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా... కేవలం మంచు, చలి ఉండే కొండ ప్రాంతాలలో మాత్రమే పెరిగే ఫైన్ వృక్ష సముదాయం.. దట్టమైన చెట్లతో కూడి ఉండే విశాలమైన లోయ అయిన "శాంతి లోయ".. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో పుష్కరానికి ఒకసారి మాత్రమే పుష్పించే "కురింజ పొదల"కు పేరైన ప్రాంతమైన "కురింజి ఆండవర్ ఆలయం" అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం... తదితరాలన్నీ కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలే...!
ఇక్కడికి చేరుకోవటం ఎలాగంటే... మధురై, కోయంబత్తూర్, తిరుచురాపల్లిలకు విమానం ద్వారా చేరుకుని.. అక్కడినుంచి ట్యాక్సీలలో కొడైకెనాల్ చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా అయితే.. మధురై వెళ్లే ఏ రైలులో అయినా ప్రయాణించి కొడై రోడ్డు స్టేషన్‌గానీ, దిండిగల్ స్టేషన్‌గానీ చేరుకుని.. అక్కడినుంచి ట్యాక్సీలలో ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
ట్రిప్లికేన్ ప్రాంతంలోగల "హైవేవిస్" కూడా తమిళనాడు రాష్ట్రంలో చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మంచుతో మిన్నంటుతున్న శిఖరం, పచ్చనైన తేయాకు తోటలు, కొండ సమీపంలో చెరువులోకి నడచి వెళ్లేందుకు కొండ మధ్య భాగంలో రహదారి, ఆనకట్ట... ఇవన్నీ కలగలసిన రమ్యమైన స్థలం "కుమాచ్చి కొండ".
కడల్‌మడం నుంచి 8 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండను బ్రిటీష్‌వాళ్లు కనుగొని "హైవేవిస్" అని నామకరణం చేశారట. దాంతో అప్పటినుంచి ఆ ప్రాంతం హైవేవిస్‌గా పిలువబడుతోంది. ఈ ప్రాంతం చుట్టుప్రక్కల ఉండే గార్డెన్, మేఘమలై, మణలారు, వెన్నియారు, మేల్‌మణలారు, ఇరవంగలార్, మహారాజా మెట్టు ప్రాంతాలు రమణీయంగా దర్శనమిస్తాయి.
కొండ అడుగు ప్రాంతంలో మేల్‌మనలారు, వట్టప్పారై, వెన్నియారు, ఇరంగలార్ వంతెన, మహారాజా మెట్టులోని మహారాశి అమ్మవారి ఆలయం.. తదితరాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతం చేరుకోవాలంటే.. తేని నుంచి ఒక ప్రభుత్వ బస్సు, ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
అయితే ఇక్కడ బస, ఆహార సదుపాయం లాంటి ఇతర సదుపాయాలు ఏవీ లేకపోవటం మూలాన పర్యాటకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. పర్యాటకులకు అనువుగా ఈ హైవేవిస్‌ను రూపొందించినట్లయితే... రాష్ట్రంలో ఇది కూడా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందగలదని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.