కస్మూరు దర్గా... నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో కస్మూరు గ్రామం ఉంది. ఇక్కడ ముస్లిం యోగిపుంగవులు హజరత్ కరీముల్లా షా ఖాద్రీగారి దర్గా వెలసింది. కులమతాలకు అతీతంగా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తజనులు ఈ దర్గాను దర్శించి తమ సమస్యలను, బాధలను తొలగించాల్సిందిగా వేడుకుంటుంటారు.
ఉదయగిరి కోట... నెల్లూరుకు 96 కిలోమీటర్ల దూరంలోగల ఉదయగిరి కోట ఆనాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తోంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఈ కోటలోని 138 మీటర్ల ఎత్తైన కోట శిఖరం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో పలు వ్యాధుల్ని నిర్మూలించే మూలికలు ఈ కోట ప్రాంతంలో లభించటంవల్ల దీన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తుంటారు. పల్లవులు, చోళరాజులు నిర్మించిన అనేక ఆలయాలు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.
పెంచల కోన... నెల్లూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ పెంచలకోన ఉంది. ఇక్కడ కొండపై నిర్మించిన "శ్రీ పెనుశిల నరసింహస్వామి ఆలయం" ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఈ పెంచలకోనలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పూర్వీకులు చెబుతుంటారు.
అన్న సముద్రం... నెల్లూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్న సముద్రం ఊర్లోని "ఖాజా రహంతుల్లా మసీదు" సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కుల మతాలకు అతీతంగా ప్రజలు, పర్యాటకులు ఇక్కడి మసీదును సందర్శిస్తుంటారు.
బారా షహీద్ దర్గా... నెల్లూరు శివార్లలోగల ఈ బారా షహీద్ దర్గాలో ఉన్న పెద్ద సరస్సు వద్ద ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ కన్నుల పండువగా నిర్వహిస్తుంటారు. ఈ సరస్సులో రొట్టెలు వదిలినట్లయితే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ పండుగ సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చిన లక్షలాది భక్తులతో సరస్సు నిండిపోతుంటుంది.
వెంకటగిరి... నెల్లూరుకు 89 కిలోమీటర్ల దూరంలోగల వెంకటగిరి చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ తయారైన చీరలు తెలుగింటి ఆడపడుచులకు ప్రీతిపాత్రం. బంగారు పోగులను, దారాలను కలగలిపి రూపొందించే వెంకటగిరి చీరలు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. అలాగే వెంకటగిరి సంస్థానాధీశుల కోటలను కూడా ఇక్కడ చూడవచ్చు.
పైన చెప్పుకున్నవేగాక... తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరుకు వంద కిలోమీటర్ల దూరంలోని సూళ్లూరుపేట కళింగనదీ తీరంలోగల చెంగాలమ్మగుడి తదితర ఆలయాలను చూడవచ్చు. అలాగే చెంగాలమ్మ గుడికి సమీపంలో ఉండే రాకెట్ కేంద్రమైన శ్రీహరికోటను దర్శించవచ్చు.
ఇంకా చెప్పుకోవాలంటే.. పెన్నానదిపై సోమశిలలో నిర్మించిన డ్యామ్, రామతీర్థం, మున్నార్ పోలూరు, గాంధీజీ కాసేపు గడిపారని చెబుతుండే పల్లిపాడు, బుచ్చిరెడ్డిపాలెం, భైరవకొండ, ప్రభాసగిరిపట్నం, నరసింహుని కొండ, సిద్ధులయ్య కొండ, నవాబుపేట, కొత్తపల్లి, వెంకటేశ్వరపాలెం తదితర అనేక పర్యాటక ప్రాంతాలు దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.