నాగార్జున సాగర్... ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల నాగార్జున సాగర్..! ఇక్కడి కృష్ణానదిలో బోట్ రైడింగ్ ఎంతో థ్రిల్లింగ్ కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి వసతి, భోజనం, రవాణా తదితర సౌకర్యాలతో పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలను కల్పిస్తోంది. అలా కాకుండా ఎవరికివారు వారి సొంత ఖర్చులతో, ప్రైవేటు వాహనాలతో కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.
హర్స్‌లీ హిల్స్... మదనపల్లికి సమీపంలో ఈ కొండలు ఉన్నాయి. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ చేసే వారికి ఇది ఎంతో అనువైన ప్రదేశం. ఇక్కడ రోప్‌వే సౌకర్యం కూడా ఉంది. ప్రకృతి సోయగాల మధ్య.. చల్లటి పిల్ల గాలులు శరీరాన్ని అలా తాకుతూ వెళుతుంటే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఈ ప్రాంతానికి కూడా పర్యాటక శాఖ అన్ని రకాల సౌకర్యాలతో ప్యాకేజీలను అందిస్తోంది.
శ్రీశైలం... ట్రెక్కర్లకు ఇదో స్వర్గధామం. మల్లిఖార్జునస్వామి కొలువైన ఈ ప్రాంతంలోని నల్లమల అటవీ అందాలు కనువిందు చేస్తుంటాయి. ఈ అడవుల్లోని జలపాతాలు మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. రవాణా, లాడ్జింగ్, బోడ్జింగ్ తదితర అన్ని రకాల సౌకర్యాలతో ఏపీ టూరిజం శాఖ ప్యాకేజీలను కల్పిస్తోంది.
భద్రాచలం... పరవళ్లు తొక్కే గోదావరి ఒడ్డున కొలువైన ప్రదేశం భద్రాచలం. సీతారాములు కొలువైన ఈఆధ్యాత్మిక ప్రదేశంలో రాక్ క్లైంబింగ్‌కు అనువైన కొండలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడికి కూడా టూరిజంశాఖ అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది.
యాదగిరిగుట్ట... లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ప్రదేశం ఇది. ఇక్కడి ఎత్తైన కొండపైకి రాక్ క్లైబ్లింగ్ చేస్తే ఆ అనుభూతే వేరు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ క్షేత్రానికి ఉదయం వెళితే సాయంత్రానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి ప్రైవేటు వాహనాలలో, సొంత ఖర్చులతోనూ వెళ్లవచ్చు లేదా.. టూరిజం శాఖ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.