ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » ఆంధ్రావని » రమణీయ శిల్పకళా నిలయం "రామప్ప దేవాలయం" (AP Tourism | Ramappa Temple | Kakatiya | Warangal | Mulugu | Venkatapuram | Palampeta)
Feedback Print Bookmark and Share
 
warangal
FILE
రామప్ప దేవాలయం గోడలపై గౌరీ కళ్యాణం, క్షీరసాగర మథనాది పౌరాణిక గాథలు, వివిధ ఆభరణ అలంకృతులైన స్త్రీమూర్తులు, గజ, మృగరాజు శ్రేణులున్నాయి. నల్లరాతిపై చెక్కిన పన్నెండు యక్షిణి విగ్రహాలు సజీవకళతో.. అద్భుతమైన ఒంపుసొంపులు, హావభావ ప్రకటనలతో అలరిస్తుంటాయి. మండపం ఉపరితలానికి ఆసరాగా నిర్మించిన స్తంభాలమీద చెక్కిన అందమైన నర్తక కన్యల శిల్పాల సౌందర్యం కూడా వర్ణించలేనిది.

గుడి పై కప్పులో పద్మ ఫలకాన్ని అమర్చిన తరువాత.. వాస్తురీత్యా వచ్చిన ఖాళీలను పూరించేందుకు, ఆ పద్మానికి నాలుగు మూలల్లోనూ నాలుగు త్రికోణాకార శిల్పాలను అమర్చారు. ఆలయం పై కప్పుపై సముద్ర మథనం ఎంతో అందంగా చెక్కబడి ఉంది. ఆలయం ప్రతి అణువూ శిల్ప సంపదతో తొణికిసలాడుతుంటుంది. ద్వారాలకు ఇరువైపులా ఏనుగు విగ్రహాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

రామప్ప ఆలయం లోపల రామాయణ, భాగవత ఘట్టాలు రమ్యమైన రీతిలో అందంగా తీర్చిదిద్దారు. గోపిక వస్త్రాపహరణ ఘట్టం చూడముచ్చటగా ఉంటుంది. ఆలయంలోని శిల్పకళా ఖండాలన్నింటికీ తలమానికం లాంటిది నాగిని శిల్పం. సౌందర్యానికి ప్రతీక అయిన ఈ శిలా ప్రతిమలో 700 ఏళ్లు గడిచినా జీవకళ ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. నాగిని చేతిలో ఒక సర్పం, మెడలో మరో సర్పం పడగను ఎడమవైపుగా తిప్పి.. ఆమె దక్షిణ భుజాన్ని చూస్తున్నట్లు చెక్కటం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.

అలాగే ఈ ఆలయంలో వీర వనితల శిల్పాలు, అలసిపోయిన సుందర స్త్రీమూర్తి ధనుస్సును పక్కనబెట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లు మలచిన శిల్పం అత్యంత రమణీయంగా ఉంటాయి. రామప్ప ఆలయ శిల్పాలమీద దేశీయ కళారీతుల ప్రభావం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. ఆలయ సింహద్వారంపైనగల మదనికా శిల్పాలపై దేశీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రధాన ఆలయమైన రుద్రాలయం కేవలం శైవ సంప్రదాయకమైన శిల్పాలకేకాక.. వైష్ణవ సంప్రదాయక విగ్రహాలకు కూడా వేదికగా నిలుస్తుంది. ఆలయ నిర్మాతలు శైవులైనప్పటికీ.. శివకేశవులకు భేదం లేదని నిరూపించారు. ఆలయ ఆవరణలో 6 అడుగుల ఎత్తు, 8 అడుగుల నంది విగ్రహం వివిధ అలంకారాలతో జీవం ఉట్టిపడేటట్లుగా ఉంటుంది. దీనిని ఎటునుంచి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా దాని కళ్లు జిగేల్మంటూ అలరిస్తాయి. అలాగే ఆలయం లోపల, బయటా చెక్కిన నల్లరాతి శిల్పాల సౌందర్యం వర్ణనాతీతం.

రామప్ప ఆలయానికి చేరుకోవాలంటే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి ఖాజీపేట జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉన్నందున వరంగల్ చేరేందుకు పలు రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కనీసం గంటకు ఒకటి చొప్పున తిరుగుతుంటాయి.

అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా రామప్ప ఆలయానికి రాష్ట్ర రవాణా బోర్డు బస్సులను నడుపుతోంది. ఇక వసతి విషయానికి వచ్చినట్లయితే.. సకల కళా సంపదలూ కొలువుదీరిన రామప్ప ఆలయంలో సందర్శకులకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పించేందుకు పర్యాటక శాఖవారు ఇంకా పూర్తిగా దృష్టి సారించలేదు. కాబట్టి.. జిల్లా కేంద్రమైన వరంగల్‌లో ఉండి ఆ పరిసరాలను దర్శించటం తప్ప మరో మార్గం లేదు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.