ఆంధ్రావని | పుణ్య క్షేత్రాలు | సముద్ర తీరాలు | పర్వత ప్రాంతాలు | అటవీ అందాలు
ప్రధాన పేజి » వినోదం » పర్యాటక రంగం » ఆంధ్రావని » మధ్యయుగాల వైభవానికి సజీవ సాక్ష్యం "సిద్ధవటం" (Ap Tourism | Ap Tourism | Andhra Pradesh | Cuddapah | Siddavatam Fort | Penna River | Rani Darbar | Siddavateswara Swami Temple)
Bookmark and Share Feedback Print
 
Fort
FILE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఓ మండలమే "సిద్ధవటం". ఇక్కడ ఉన్న "సిద్ధవటం కోట" మధ్యయుగాలనాటి కళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నేటికీ అలరారుతోంది. దక్షిణం దిశగా పెన్నానది, మిగిలిన మూడువైపులా లోతైన అగడ్తలతో శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట ఆంధ్రప్రదేశ్ చారిత్రక సంపదలలో ఒకటిగా భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌ దర్శనీయ స్థలాల్లో ఒకటైన సిద్ధవటం కోటను వేసవి సెలవుల్లో ఎంచక్కా అలా చుట్టివచ్చేద్దామా..?!

సిద్ధవటం కోటకు పడమటి దిశగా ఒకటి, తూర్పు దిశగా మరొకటి ద్వారాలున్నాయి. ముఖద్వారం రెండువైపులా ఆంజనేయస్వామి, గరుత్మంతుడి శిల్పాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో ఉండే అందమైన శిల్పాలు చూపరులను కట్టిపడేస్తాయి. పశ్చిమ ద్వారం లోపలి పై భాగంలో రాహువు గ్రహణం పట్టడం, గ్రహణం వదలటాన్ని వివరంగా తెలిపేలా చిత్రాలు ఆకట్టుకుంటాయి.

కోట మధ్య భాగంలోని అంతఃపురం మాత్రం నేడు శిథిల దశలో ఉండగా.. రాణి దర్బారు, ఈద్గా మసీదు, దానికి సమీపంలోని నగారాఖానాలు మాత్రం బాగానే ఉన్నాయి. నగారాఖానాకు వెనుకవైపు కోట గోడకు మధ్యలో ఓ తాగునీటి కోనేరు ఉంది. అలాగే కోట లోపల సిద్ధవటేశ్వర స్వామివారి ఆలయం, దానికి ఎదురుగా నంది విగ్రహం పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే ఈ ఆలయం పక్కనే ఉన్న కామాక్షి ఆలయం శిథిల దశలో ఉండగా, నేడు మరమ్మత్తులతో మనోహరంగా తీర్చిదిద్దారు.

ఇక కోట తూర్పు ద్వారానికి సమీపంలో షావలి దర్గా చూడదగ్గ మరో ప్రదేశం. దీనిని టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతుంటారు. దాని ప్రక్కనే మసీదు.. ఆ మసీదుకు తూర్పుదిశగా కోట గోడలోకి ఓ సొరంగ మార్గాన్ని ఏట్లోకి కలుపుతూ నిర్మించారు. ఆ రోజుల్లో చక్ర యంత్రం ద్వారా ఏటిలోని నీటిని మసీదులోగల తొట్టిలోకి తోడేవారని పూర్వీకులు చెబుతుంటారు.

కోట చరిత్రను చూస్తే.. శ్రీ కృష్ణదేవరాయలవారి అల్లుడు వరదరాజు ముందుగా ఈ సిద్ధవటం కోటను పరిపాలించేవాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో భాగంగా ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాలలో బాగా సహకరించేవాడు. అందుకు గుర్తుగా అమరనాయకరంగా సిద్ధవటాన్ని ఎల్లమరాజుకుకు కానుకగా ఇచ్చాడు. అంతేగాకుండా మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.