అనంతరం మట్లి అనంతరాజు మట్టికోటగా ఉన్న "సిద్ధవటం కోట"ను శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా నిర్మించాడు. అలాగే తన తండ్రి పేరుతో ఎల్లమరాజు చెరువును, తనపేరుతో అనంతరాజు చెరువును కూడా తవ్వించాడు. అలా కాలం గడుస్తుండగా మట్లి రాజుల పతనం తరువాత సిద్ధవటం ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా ఆక్రమణలోకి వచ్చింది.
ఆ తర్వాత ఆర్కాట్ నవాబుల స్వాధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతాన్ని, అప్పట్లో కడపను పరిపాలించే అబ్దుల్ నబీఖాన్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆయన తరువాత మయనా నవాబుల పాలనలో ఉన్న సిద్ధవటం అనంతరం ఈస్టిండియా కంపెనీ స్వాధీనంలోకి వెళ్లిపోయింది.
సిద్ధవటం మండలం గురించి చెప్పుకోవాలంటే.. ఇది కడప పట్టణం నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్లే మార్గంలో పెన్నానది ఒడ్డున ఉంది. కడప పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధవటంలో ఎక్కువగా సిద్ధులు నివసిస్తుంటారు. ఈ ప్రాంతంలో వట వక్షాలు (మర్రి చెట్లు) విస్తారంగా పెరుగుతుంటాయి. అందుకే సిద్ధులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో వట వృక్షాలు కూడా విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చినట్లుగా స్థానికులు చెబుతుంటారు.
అప్పట్లో సిద్ధవటం పరిసర ప్రాంతాలలో జైనులు ఎక్కువగా నివసించేవారట. ఓ కాలంలో జిల్లా కేంద్రంగా ఉన్న సిద్ధవటాన్ని.. పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్న కారణంగా దాన్ని కడపకు మార్చారట. ఇక్కడున్న మధ్యయుగాలనాటి సిద్ధవటం కోటను 1956వ సంవత్సరంలో పురావస్తు శాఖ స్వాధీనంలోకి తీసుకుంది. అదలా ఉంచితే.. సిద్ధవటం మండలం సమీపంలోని ఏటి పొడవునా ఉన్న అనేక ఆలయాలు కూడా చూడదగ్గవే. వీటిలో రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగ్గది. అలాగే భాకరా పంతులు పేరుతో నిర్మించి 16 స్తంభాల మంటపం తప్పక చూడాల్సిన ప్రదేశమే.