తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టించుకోక పోవడం వల్లే ప్రత్యేక తెలంగాణా సెంటిమెంట్ పుట్టుకొచ్చి, కోటి సమస్యల కోనగా మారిందని ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు చిరంజీవి అన్నారు. సాగునీటి పంపకం, నియామకాల్లో అన్యాయం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి పాలకుల వివక్షే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాను అభివృద్ధి సమస్య పట్టిపీడిస్తోందన్నారు.
తెలంగాణ సెంటిమెంటును గౌరవిద్దామని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుదామని ఆయన అన్నారు. కోస్తాలోనూ, రాయలసీమలోనూ వెనకబడిన ప్రాంతాలున్నాయని, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తామని చిరంజీవి ప్రకటించారు. తెలంగాణా సమస్యలతో, అణచివేతకు గురవుతోందన్నారు. తెలంగాణలో పోరాట స్ఫూర్తి ఉండగా, ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారన్నారు.
అలాగే అపారమైన మానవవనరులు ఉన్నాయన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు వ్యవసాయ భూముల సేకరణకు తమ పార్టీ వ్యతిరేకమని, అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామికరణకు కట్టుబడుతామన్నారు. రైతులకు అన్యాయం చేసే పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల వారిని గుర్తించి, వారికి అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. అలాగే.. పేదలకు సాయం చేస్తామని ఆయన చెప్పారు.
|