ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి ఆయన సొంత ఊరైన మొగల్తూరు వాసులు అండగా నిలువనున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈనెల 26వ తేదీ మంగళవారం పుణ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బహిరంగ సభకు మొగల్తూరు వాసులంతా తరలి వచ్చారు.
ఆ రోజు గ్రామంలోని ప్రతి ఇంటికి తాళాలు కనిపించాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నిత్యం సందడిగా ఉండే మొగల్తూరు... చిరు బహిరంగ సభ జరిగిన రోజున ఒక్కరు కూడా తమ ఇళ్ళలో లేక పోవడం గమనార్హం. ఇదే విషయంపై గ్రామస్థులు స్పందిస్తూ.. చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తమ ప్రాంతం వాసేనని, ఇక్కడ ఉన్న పిల్ల కాలువల్లో ఈత కొట్టిన వ్యక్తేనని గత స్మృతులను నెమరు వేసుకున్నారు.
చిరంజీవి ముఖ్యమంత్రి అయితే.. తమ గ్రామం రూపురేఖలే మారిపోతాయని గ్రామస్థులు అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు సహకారం అందిస్తామని వారు ప్రకటించారు. చిరంజీవి భవిష్యత్ ముఖ్యమంత్రిగా మొగల్తూరు వాసులు అభిప్రాయపడ్డారు.
|