జన హోరులో తడిసి ముద్దయ్యేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. తన తొలి రాజకీయ బహిరంగ సభను అశేష జనవాహిని మధ్య దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయేలా నిర్వహించారు. అదేరీతిలో తన రాష్ట్ర పర్యటనను నిర్వహించాలని మెగాస్టార్ సన్నిహితులు పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇందులోభాగంగా ఈనెలాఖరు నుంచి మెగా రాష్ట్ర పర్యటన ప్రారంభమవుతుంది.
ముఖ్యంగా వచ్చే 27, 28, 30 తేదీల్లో ఏదో ఒక రోజు నుంచి శ్రీకారం చుట్టొచ్చని ప్రజారాజ్యం పార్టీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ యాత్ర ప్రారంభ ప్రాంతంపై భిన్నకథనాలు వినొస్తున్నాయి. చిరంజీవి తన రాజకీయ ప్రవేశం రాయలసీమ ప్రాంతం నుంచి చేశారని, అందువల్ల రాష్ట్ర పర్యటన మాత్రం కోస్తాంధ్ర నుంచి చేపట్టాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. మరికొందరు మాత్రం బాగా వెనుకబడిన ప్రాంతమైన తెలంగాణ నుంచి నిర్వహించాలని సూచిస్తున్నారు.
చిరు పర్యటన మొత్తం రెండు విడతలుగా సాగనుంది. విజయదశమి పండుగ సమయంలో అంటే.. అక్టోబరు ఏడు నుంచి 11వ తేదీల మధ్య కొంత బ్రేక్ ఇవ్వాలని చిరు భావిస్తున్నారు. అయితే పర్యటన సమయంలో తలెత్తే భద్రతా అంశాలపై లోతుగా చర్చ సాగుతోంది. ఇందుకోసం మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి, చిరు సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్‌ల సారథ్యంలో ఐదు వందల మంది ప్రైవేట్ సిబ్బంది మెగాస్టార్ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారు.
అలాగే మెగా రథం సాగే ప్రచార మార్గం, సమాచారం, మీడియా వ్యవహారాలు చూసుకునేందుకు గాను విడివిడిగా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చిరంజీవి ప్రసంగించే బహిరంగ సభలు, రోడ్‌షోలు, ప్రజలతో ముఖాముఖీగా ముచ్చటించే ప్రాంతాలు తదితర అంశాలపై పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
|