తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత డీకే.ఆదికేశవులు నాయుడు ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరే ముందు సత్య సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు పుట్టపర్తి వెళ్ళినట్టు సమాచారం. ఆయన్ను కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించేందుకు పీఆర్పీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆదికేశవులు కోరగా, కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. దీంతో ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు.
దీంతో ప్రజారాజ్యం తరపున చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలో ప్రధాన పాత్ర పోషించవచ్చని అనుకుంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కేటగిరీలోకి మారిపోయిన తర్వాత ఆదికేశవులు నాయుడు పొరుగున ఉన్న రాజంపేట స్థానంపై కన్నేశారు. అయితే, ఆయన తొలుత కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ప్రకటించారు.
ఆ తరువాత రాజంపేట నుంచి పోటీ చేయాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ మాత్రం తండ్రీ కొడుకులకు టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోనని, పార్టీ కోసం పనిచేయబోనని డీకే బహిరంగంగానే ప్రకటించారు. కాగా, ఆదికేశవులు నాయుడును ప్రజారాజ్యం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. |