వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ (పాలమూరు) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) మహిళా నేత, సినీ నటి విజయశాంతి విముఖత వ్యక్తం చేశారు. ముందుగా మహబూబ్‌నగర్ నుంచి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ బరిలో దిగాలని భావించారు. అయితే, శనివారంనాటికి ఆయన అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని విజయశాంతికి పాలమూరు స్థానాన్ని ప్రకటించారు.
మెదక్ నుంచి స్వయంగా బరిలోకి దిగాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న రాములమ్మ.. అలకపాన్పు ఎక్కినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, తన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆమె సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. కాగా, శనివారం మరో తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లతో లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెరాస మహిళా నాయకురాలు విజయశాంతిని మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీలో దింపుతున్నట్లు ప్రకటించారు. అయితే, కేసీఆర్ ప్రతిపాదనపై విజయశాంతి ప్రతిస్పందిస్తూ మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసే విషయమై తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారని సమాచారం. |